వరుస సినిమాలతో హీరోగా బిజీగా ఉన్న నాని కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయడానికి, కొత్త కాన్సెప్ట్ సినిమాలను ఎంకరేజ్ చేయడానికి నిర్మాతగా కూడా మారాడు. వాల్‌పోస్టర్ సినిమా అనే బ్యానర్‌పై తొలి ప్రయత్నంగా చేసిన `అ!` నానికి చాలా మంచి పేరుని తెచ్చిపెట్టింది. ఇప్పుడు నాని నిర్మాణంలో విశ్వక్ సేన్ హీరోగా రూపొందిన థ్రిల్లర్ `హిట్`. ఈ సినిమా టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను మెప్పించాయి. పోలీస్ ఆఫీసర్‌గా విశ్వక్ సేన్ నటించాడు. విశ్వక్ తన నటనతో ఆకట్టుకున్నాడా? డెబ్యూ డైరెక్టర్ శైలేష్ కొలను సక్సెస్ సాధించాడా? అసలు సినిమా ఆడియెన్స్‌ను ఆకట్టుకుందా? లేదా? అనే విషయాలను తెలుసుకోవాలంటే ముందుగా కథలోకి వెళదాం...
కథ:
హైదరాబాద్ పోలీసులు సిటీ జరిగే నేరాలను ఆరికట్టడానికి హోమిసైడ్ ఇంటర్‌వెన్షన్ టీమ్(హిట్)ను విశ్వనాథ్ నేతృత్వంలో ఏర్పాటు చేస్తారు. ఆ టీమ్‌లో కీలక సభ్యుడు విక్రమ్(విశ్వక్ సేన్). అయితే అతని జీవితంలో జరిగిన కొన్ని ఘటనల కారణంగా అతను ఇన్వెస్టిగేషన్‌లో నిప్పును చూస్తే భయపడుతుంటాడు. డాక్టర్స్ అతన్ని రెస్ట్ తీసుకోమని చెప్పినా వినిపించుకోడు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉండే నేహా(రుహానీ శర్మ), విక్రమ్ ప్రేమించుకుంటారు. నేహా కోరిక మేరకు విక్రమ్ ఆరు నెలలు సెలవు తీసుకుంటాడు. రెండు నెలలు అయిన తర్వాత ఓ రోజు నేహా కనపడటం లేదని ఫోన్ వస్తుంది. దాంతో వెంటనే డ్యూటీలో జాయిన్ అవుతాడు విక్రమ్. కానీ నేహా కేసులో విక్రమ్ కూడా అనుమానితుడే కావడంతో ఆ కేసును మరో ఆఫీసర్‌కి అప్పగిస్తారు. అయితే నేహా కేసును వ్యక్తిగతంగా తీసుకుని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన విక్రమ్‌కి ఓ క్లూ దొరుకుతుంది. అదే సమయంలో ఆమె ఇన్వెస్టిగేట్ చేస్తున్న చివరి కేసు ఏంటని చూస్తే ప్రీతి అనే అమ్మాయి మిస్సింగ్ కేసు. దాంతో ప్రీతి కేసులో వెళితే ఏమైనా క్లూ దొరుకుతుందేమోనని విక్రమ్ ప్రీతి కేసుని తాను తీసుకుంటాడు. కేసుని సాల్వ్ చేసే క్రమంలో ప్రీతి కేసుకి, నేహా కేసుకి లింకు ఉందేమోనని విక్రమ్‌కి అనిపిస్తుంది. విక్రమ్ అనుమానం నిజమేనా? ప్రీతి ఎవరు? నేహాను కిడ్నాప్ చేసిందెవరు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...
సమీక్ష:
`ఫలక్‌నుమాదాస్` హిట్ తర్వాత విశ్వక్‌సేన్ నటించిన చిత్రమిది. ఇప్పటి వరకు విశ్వక్ నటించిన రెండు, మూడు చిత్రాలకు పూర్తి భిన్నమైన సినిమా ఇది. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా.. మానసికంగా ఇబ్బంది పడుతున్న వ్యక్తిగా విశ్వక్‌సేన్ రెండు పార్శ్వాలను చక్కగా చూపించాడు. కథానుగుణంగా విక్రమ్ పాత్రలో ఒదిగిపోయాడు. ఇక రుహానీ శర్మ, విశ్వక్ స్నేహితుడు రోహిత్ పాత్రధారిగా నటించిన చైతన్య, మురళీశర్మ, భానుచందర్, బ్రహ్మాజీ, రవివర్మ తదితరులు వారి వారి పాత్రల్లో ఒదిగిపోయారు. సినిమాలో నటుల పరంగా అందరూ వారి వారి పనిని చక్కగా నిర్వర్తించారు. ఇక సినిమా అంతా దర్శకుడి పనితనం మీదనే రన్ అయ్యింది. దర్శకుడు శైలేష్ కొలనుని ఈ విషయంలో అభినందించాలి. ఎందుకంటే తొలి సినిమానే చాలా చక్కగా తెరకెక్కించాడనాలి. మేకింగ్ పరంగా తనెక్కడా పొరపాటు చేయలేదు. అయితే స్లో నెరేషన్ అనిపిస్తుంది. సినిమా వ్యవథి సాధారణంగానే ఉన్నా కూడా స్లోగా ఉండటం వల్ల సినిమా పెద్దదిగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఫస్టాఫ్ కంటే సెకండాఫ్‌లో స్టార్టింగ్ పది నిమిషాలు కథ పక్కకు వెళ్లినట్లు అనిపిస్తుంది. సన్నివేశాలను అల్లికను చక్కగా తీసుకొచ్చాడు శైలేష్. అంతా బాగానే ఉంది కానీ.. సినిమా మెయిన్ థ్రిల్లింగ్ పాయింట్ అంత ఎఫెక్టివ్‌గా అనిపించదు.వివేక్ సాగర్ తన నేపథ్య సంగీతంలో సన్నివేశాలను మరో లెవల్‌కి ఎలివేట్ చేశాడనే చెప్పాలి. గ్యారీ మరో పది నిమిషాలు సినిమాను ట్రిమ్ చేసి ఉండొచ్చుననిపించింది. మణికందన్ సినిమాటోగ్రఫీ బావుంది. ఇక సినిమాలో హీరో మానసిక పరిస్థితికి కారణమైన పరిస్థితుల గురించి పూర్తిగా చెప్పలేదు. హిట్ ఫ్రాంచైజీ ఉంటుందని చెప్పాడు కాబట్టి మరి నెక్ట్స్ పార్ట్‌లో ఉంటుందనుకోవాలేమో. కమర్షియల్ అంశాలేవీ ఉండవు. కాబట్టి కమర్షియల్ సినిమాలను ఎంజాయ్ చేసేవారు ఈ సినిమాను పెద్దగా ఎంజాయ్ చేయలేరు.
చివరగా.. హిట్... ఓకే అనిపించే క్రైమ్ థ్రిల్లర్
Comments