13 ఏళ్ల తర్వాత హిట్ కాంబినేషన్...
- IndiaGlitz, [Friday,June 07 2019]
13 ఏళ్ల తర్వాత ఓ హిట్ కాంబినేషన్ రిపీట్ కాబోతుంది. ఇంతకు ఆ హిట్ కాంబో ఏదో తెలుసా!. స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను. 2005లో దిల్‌రాజు నిర్మించిన 'భద్ర' సినిమాతో బోయపాటి దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఆ సినిమా తర్వాత దిల్‌రాజు, బోయపాటి కాంబినేషన్లో సినిమా రూపొందలేదు. అయితే ఇప్పుడు బోయపాటి తన తదుపరి సినిమాను బాలకృష్ణతో చేయాలనుకున్నాడు. కథంతా ఓకే అయ్యింది.
ముందు ఈ సినిమాను బాలకృష్ణే నిర్మించాలనుకున్నా.. 'యన్.టి.ఆర్' బయోపిక్ డిజాస్టర్ కారణంగా తన ప్రయత్నాన్ని మానుకున్నాడు. మధ్యలో సి.కల్యాణ్ పేరు కూడా వినిపించింది. అయితే అంత బడ్జెట్‌తో తర్వాత మార్కెటింగ్ చేసుకోవడం అంటే కల్యాణ్‌కు కాస్త కష్టమే. దాంతో ఆయన కూడా డ్రాప్ అయ్యాడట. దాంతో బోయపాటి దిల్రాజును కలిశాడు. దిల్‌రాజు కూడా బాలయ్యతో సినిమా చేయడానికి ఆసక్తిగానే ఉన్నాడట. అంతా ఓకే అయితే బాలకృష్ణ, దిల్‌రాజు కాంబినేషన్లో రూపొందబోయే తొలి చిత్రమిదే అవుతుంది.