డిసెంబర్ 19న ఆలౌట్.. జనవరి 19న రికార్డ్!

  • IndiaGlitz, [Tuesday,January 19 2021]

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా ఎవరూ ఊహించని రీతిలో ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియాపై మూడు వికెట్ల తేడాతో భారత్‌ అద్భుత విజయం సాధించింది. ఈ గెలుపుతో గబ్బా పిచ్‌లో ఓటమంటే ఎరుగని కంగారూలకు టీమిండియా తమ సత్తా ఏంటో చూపించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 32 ఏళ్లుగా ఈ స్టేడియంలో ఓటమంటే ఎరుగని ఆసిస్‌కు ఓటమి అంటే ఎలా ఉంటుందో భారత్‌ రుచి చూపించింది. ఇవాళ జరిగిన ఈ మ్యాచ్‌కు.. ఇదివరకు జరిగిన మ్యాచ్‌కు లింక్ ఉంది.

డిసెంబర్-19 కథ ఇదీ..

అదేమిటంటే.. సరిగ్గా నెల రోజుల క్రితం అనగా.. డిసెంబర్-19న భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్లు ఘోరంగా విఫలమయ్యారు. కేవలం 36 పరుగులకే అందరూ ఆలౌట్ అయ్యారు. భారత్ ఇలా తక్కువ పరుగులతో కుప్పకూలడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. టీమిండియా మాజీ క్రీడాకారులు సైతం తిట్టిపోశారు. గెల‌వాల్సిన మ్యాచ్‌లో టీమిండియా అనూహ్య రీతిలో ప‌రాభ‌వాన్ని మూట‌క‌ట్టుకోవడమేంటి..? విమర్శలు గుప్పించారు. అంతేకాదు.. టెస్టు చ‌రిత్రలో నిజంగా ఇదో పీడ‌క‌ల అంటూ ప్రముఖులు, క్రీడాభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోశారు.

జనవరి-19 కథ ఇదీ..

అయితే ఆ రేంజ్‌లో విమర్శలు గుప్పించే సరికి ఒక్క నెలరోజుల గ్యాప్‌లోనే టీమిండియా తన సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పింది. అది కూడా పెద్ద తలకాయలు (టాప్ బ్యాట్స్‌మెన్స్) ఎవరూ లేకపోయినప్పటికీ ఏ మాత్రం జంకకుండానే మన వాళ్లు దుమ్ము లేపేశారు. ఇవాళ అనగా జనవరి-19న జరిగిన మ్యాచ్‌లో గెలిచి టీమిండియా చరిత్ర సృష్టించింది. 328 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఇంకా 18 బంతులు మిగిలుండగానే ఘన విజయం సాధించింది. శుభ్‌మన్ గిల్(91) అద్భుత ఆరంభం ఇవ్వడంతో చటేశ్వర్ పుజారా(56) అమోఘమైన డిఫెన్స్‌తో ఆసీస్ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టాడు. ఇక్కడే ఇండియా సత్తా ఏంటో ఆసిస్‌కు బాగా తెలిసొచ్చింది. అలా.. పంత్‌ (89), పుజారా (56) ఈ మ్యాచ్‌ను గెలిపించారు. 2-1 సిరీస్‌తో మ్యాచ్‌ను టీమిండియా కైవసం చేసుకుని ఆసిస్ చరిత్రను తిరగరాసిందని చెప్పుకోవచ్చు.

చూశారుగా.. డిసెంబర్-19న ఆలౌట్ అవ్వడం, తీవ్ర విమర్శలు కావడంతో.. సరిగ్గా నెల రోజుల్లోనే జనవరి-19న టీమిండియా రికార్డ్ బ్రేక్ చేసి సత్తా చూపించింది. అది కూడా కంగారూలకు కలలో కూడా ఊహించని విజయం.. నిద్రపోతే చాలు మళ్లీ మళ్లీ గుర్తొచ్చేలా టీమిండియా గెలవడం మామూలు విషయం కాదు. ప్రస్తుతం రెండు తేదీలను డిసెంబర్, జనవరి-19ని పోలుస్తూ చూశారా.. టీమిండియాలో ఏ రేంజ్‌లో మార్పు వచ్చిందో అంటూ నెటిజన్లు, క్రీడాభిమానులు పెద్ద ఎత్తున పోస్ట్‌లు పెడుతున్నారు.