‘హిరణ్య’ ప్రీ ప్రొడక్షన్ పూర్తి.. హీరో మారుతాడా?
- IndiaGlitz, [Tuesday,June 23 2020]
భారీ సెట్స్ వేసి సినిమాలు చేయడంలో డైరెక్టర్ గుణశేఖర్ దిట్ట. ఈయన తెరకెక్కించిన గత చిత్రం రుద్రమదేవి. భారీ బడ్జెట్‌తో మరో చారిత్రాత్మక చిత్రాన్ని తెరకెక్కించడానికి గుణశేఖర్ సిద్ధమైన సంగతి తెలిసిందే. విలక్షణ నటుడు రానా దగ్గుబాటితో గుణశేఖర్ రాక్షసరాజు హిరణ్యకశ్యప, భక్త ప్రహ్లాదుడు మధ్య జరిగిన కథను సినిమాగా తీయాలనుకున్నాడు. ఈ సినిమా గ్రాఫికల్ వర్క్ కోసం అంతర్జాతీయం 17 స్టూడియోస్ వర్క్ చేశాయి. దాదాపు రెండేళ్లు ఈ కథకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులపై దృష్టి పెట్టిన గుణశేఖర్ వాటిని పూర్తి చేశాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలను త్వరలోనే ప్రకటిస్తానని కూడా ఆయన చెప్పారు. ఈ చిత్రానికి ‘హిరణ్య’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
హీరో మారుతాడా..?
హిరణ్య సినిమాను రానా దగ్గుబాటితో చేయడానికి సురేశ్ ప్రొడక్షన్స్‌తో కలిసి గుణశేఖర్ వర్క్ చేశాడు. అయితే ప్రస్తుతం కరోనా కారణంగా ఈ సినిమాను ముందుకు తీసుకెళితే బడ్జెట్ పరంగా ఇబ్బందులు ఎదురవుతాయని సురేశ్‌బాబు భావిస్తున్నాడట. అందుకనే ఆయన ఈ ప్రొడక్షన్ నుండి తప్పుకున్నట్లు సమాచారం. దీంతో హీరో కూడా మారే అవకాశం ఉందని అంటున్నారు. మరి చివరకు ఏం అవుతుందో చూడాలి. ఇప్పటి వరకు ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కోసం దాదాపు పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు వార్తలు వినపడుతున్నాయి.