గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. హిందూ మత నాయకుడు కాళీచరణ్ అరెస్ట్

  • IndiaGlitz, [Thursday,December 30 2021]

భారత జాతిపిత మహాత్మాగాంధీని కించపరుస్తూ .. గాడ్సేపై ప్రశంసలు కురిపించిన హిందూ మత నేత కాళీచరణ్‌ మహారాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలో ఆయనను రాయ్‌పుర్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. రాయ్‌పుర్‌లోని రావణ్‌ భాగా మైదానంలో ఈ ఆదివారం జరిగిన ధర్మ సన్సద్‌ సభలో కాళీచరణ్‌ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీపై ఆయన అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.

అదే సమయంలో బాపూజీని హత్య చేసిన గాడ్సేను ప్రశంసించడం వివాదానికి దారితీసింది. అంతేగాక, మతాన్ని కాపాడుకునేందుకు ప్రజలు ప్రభుత్వాధినేతగా బలమైన హిందూ నాయకుడిని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. దీంతో కాళీచరణ్ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగింది. ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ సైతం ఈ వ్యాఖ్యలను ఖండించారు.

న‌రేంద్ర మోదీ గారూ… ఈ దేశాన్ని మీరెలా త‌యారు చేశారు…జాతి పిత గాంధీపై బ‌హిరంగంగానే అనుచిత వ్యాఖ్య‌లు చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేత నితిన్ రౌత్ మండిపడ్డారు. ఇక ఎన్సీపీ నేత‌, మ‌హారాష్ట్ర మంత్రి న‌వాబ్ మాలిక్ కూడా ట్విట్ట‌ర్ వేదిక‌గా కాళీచరణ్‌పై ఫైరయ్యారు. బాపు హంత‌కులు ఇంకా బ‌తికే వున్నార‌ని, అందుకు సిగ్గుప‌డాల‌ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా రాయ్‌పుర్‌లో ఆయనపై ఓ కాంగ్రెస్‌ నేత పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అలాగే ఛత్తీస్‌గడ్‌లోని టిక్రాపారా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తుండటంతో కాళీచరణ్‌ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పోలీసులు ట్రాక్‌ చేస్తారన్న అనుమానంతో ఆయన అనుచరులు కూడా తమ ఫోన్లను స్విచ్ఛాఫ్‌ చేసుకున్నారు. ఈ క్రమంలో మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలో కాళీచరణ్‌ గెస్ట్‌హౌజ్‌ బుక్‌ చేసుకున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు వెళ్లగా.. కాళీచరణ్‌ కన్పించలేదు. కానీ పోలీసులు తీవ్రంగా గాలించి ఎట్టకేలకు ఖజురహోకు సమీపంలోని ఓ హోటల్‌లో ఆయన ఆచూకీని కనుగొన్నారు. అనంతరం ఆయనను అరెస్టు చేసి ఛత్తీస్‌గఢ్‌కు తరలించారు.