ఆర్జీవీ 'దిశ ఎన్కౌంటర్'ని రెండు వారాలు ఆపిన హైకోర్టు!
- IndiaGlitz, [Monday,June 14 2021]
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ గురించి అందరికి తెలిసిందే. వివాదాలతో కూడిన సబ్జెక్టుని డీల్ చేయడంలో వర్మకు వర్మే సాటి. లీగల్ గా ఎన్ని అడ్డంకులు ఎదురైనా తాను తెరకెక్కించాలనుకున్న చిత్రం విషయంలో వర్మ వెనకడుగు వేయడు. రాంగోపాల్ వర్మ తెరవెనుక నుంచి రూపొందిస్తున్న చిత్రం దిశ ఎన్కౌంటర్.
తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశవ్యాప్తంగా దిశ సంఘటన సంచలనం సృష్టించింది. ఆ సంఘటన ఆధారంగా వర్మ దిశ ఎన్కౌంటర్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ చిత్రంపై దిశ కుటుంబ సభ్యులు వ్యతిరేకంగా ఉన్నారు. ఈ చిత్రం విడుదల కాకుండా ఆపాలని దిశ కుటుంబ సభ్యులు హైకోర్టుని ఆశ్రయించారు.
సోమవారం ఈ కేసు విచారణకు వచ్చింది. ఈ చిత్రానికి దర్శక నిర్మాతలం తామే అని ఆనంద్ చంద్ర, అనురాగ్ కోర్టుకు తెలిపారు. ఎవరికీ అభ్యంతరాలు లేకుండా ఈ చిత్ర టైటిల్ 'ఆశ ఎన్కౌంటర్ గా మార్చినట్లు చిత్ర యూనిట్ కోర్టుకు తెలిపింది. ఈ చిత్ర సెన్సార్ కూడా పూర్తయింది. సెన్సార్ బోర్డు 'ఏ' సర్టిఫికేట్ జారీ చేశారు.
సినిమాపై ఇంకా ఏవైనా అభ్యంతరాలు ఉంటే సెన్సార్ సర్టిఫికేట్ ని సవాల్ చేసేందుకు వీలుగా 2 వారాల పాటు చిత్రాన్ని వాయిదా వేయగలం అని చిత్ర యూనిట్ కోర్టుకు తెలిపింది. దీనితో న్యాయస్థానం ఈ చిత్రాన్ని 2 వరాలు విడుదల వాయిదా వేయాలని ఆదేశించింది.
హైదరాబాద్ లో 2019లో జరిగిన దిశ అత్యాచారం, హత్య సంఘటన దేశం మొత్తం ప్రకంపనలు సృష్టించింది. హైదరాబాద్ పోలీసులు త్వరగానే కేసుని ఛేదించారు. నిందితులను అరెస్ట్ చేశారు. అయితే నేరగాళ్లు తమపై దాడి చేసి తప్పించుకోవాలని ప్రయత్నించగా ఎన్కౌంటర్ చేసినట్లు పోలీసులు అప్పట్లో తెలిపారు. ఈ సంఘటనకు వర్మ తన క్రియేటివిటీ జోడించి దిశ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.