రిలీజ్ కు ముందు ‘వాల్మీకి’కి ఊహించని షాక్.. నోటీసులు!
- IndiaGlitz, [Friday,September 13 2019]
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మాస్ కమర్షియల్ సినిమాల హరీష్ శంకర్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘వాల్మీకి’. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘జిగర్తాండ’ అనే సినిమాకు అఫీషియల్ రీమేక్‌గా రూపొందుతున్న ఈ సినిమా సెప్టెంబర్-20న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలో చిత్రయూనిట్‌కు ఊహించని షాక్ తగిలింది. సినిమా రిలీజ్ మొదలుకుని రిలీజ్‌కు ముందు వరకు దర్శకనిర్మాతలకు వివాదాలు తప్పట్లేదు. ఇప్పటికే.. ‘వాల్మీకి’ చిత్ర టైటిల్ మార్చాల్సిందేని బోయ హక్కుల పోరాట సమితి పోరాటం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై వారు హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేయగా తాజాగా ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టింది.
ఈ క్రమంలో ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న హైకోర్టు.. చిత్ర హీరో వరుణ్ తేజ్, చిత్ర యూనిట్‌కు, రాష్ట్ర డీజీపీ, సెన్సార్ బోర్డు, ఫిలించాంబర్‌కు నోటీసులు జారీ చేయడం జరిగింది. నాలుగు వారాల్లో ఈ వివాదంపై కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు తేల్చిచెప్పింది. ఈ క్రమంలో తదుపరి విచారణ మరో నెలరోజుల తర్వాత ఉంటుందని కోర్టు తెలిపింది.
మొత్తానికి చూస్తే చిత్రం రిలీజ్ దాదాపు ఆగిపోయిందని తెలుస్తోంది. ఇప్పటికే ఒకసారి రిలీజ్‌ను వాయిదా వేసుకుంది. అయితే తాజాగా కోర్టు దెబ్బతో మరోసారి రిలీజ్ వాయిదా పడే అవకాశాలున్నాయి. ఇప్పటి వరకూ ఈ నోటీసులు వ్యవహారంపై గానీ.. రిలీజ్ తేదీలో మార్పులపై గానీ వరుణ్ గానీ దర్శకనిర్మాతలు గానీ మీడియా ముందుకు రాలేదు.. అంతేకాదు కనీసం సోషల్ మీడియా వేదికగా కూడా చిన్నపాటి రియాక్షన్ లేకపోవడం గమనార్హం.