మూడు రాజధానులు: వైసీపీకి వరుస షాక్‌లు!!
- IndiaGlitz, [Thursday,January 23 2020]
నవ్యాంధ్ర రాజధాని అమరావతిని తరలించొద్దంటూ గత 37 రోజులుగా రాజధాని రైతులు, రైతు కూలీలు ఆందోళనలు, నిరసనలు, దీక్షలు, ర్యాలీలతో హోరెత్తిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. మూడు రాజధానులు చేసి తీరుతానని సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మాత్రం ధీమాతో ముందుకెళ్తున్నారు. ఈ తరుణంలో ఇందుకు సంబంధించిన బిల్లును సైతం ఇప్పటికే కేబినెట్, శాసనసభ ఆమోదం లభించింది. ఇక మిగిలిందల్లా శాసన మండలి మాత్రమే. అయితే.. ఈ క్రమంలో మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా పలువురు ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై గురువారం నాడు హైకోర్టులో బుధవారం నాడు విచారణ జరిగింది. అయితే ఆ 37మంది రైతుల వాదనలు విన్న హైకోర్టుకు ఇవాళ్టికి వాయిదా వేయగా.. కాసేపు వాదోపవాదాలు జరిగిన తర్వాత విచారణను ఫిబ్రవరి 26కి హైకోర్టు వాయిదా వేయడం జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు పలు కీలక సూచనలు సైతం చేసింది. మరీ ముఖ్యంగా ఈ పిటిషన్లకున్న ప్రాధాన్యత దృష్ట్యా ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ విషయమై ప్రధాన న్యాయమూర్తి అడ్వకోట్ జనరల్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ‘బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొంది మండలికి వెళ్లింది. అక్కడ బిల్లును సెలెక్ట్ కమిటీకి నివేదించారు’ అని స్పష్టం చేశారు. కాగా.. ప్రధాన న్యాయమూర్తి స్పందిస్తూ ప్రస్తుతం విచారణ అవసరం లేదని అభిప్రాయపడ్డారు. అయితే, పిటిషనర్ల తరపు న్యాయవాది కలుగజేసుకుని, విచారణ జరగకపోతే.. ప్రధాన కార్యాలయాలను తరలిస్తారని పేర్కొన్నారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి స్పందిస్తూ.. విచారణ పూర్తయ్యేలోపు కార్యాలయాలు తరలిస్తే కనుక అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని తేల్చిచెప్పారు. అనంతరం విచారణను కోర్టు ఫిబ్రవరి 26కు వాయిదా వేసింది. కోర్టు నిర్ణయం వచ్చే వరకు ఈ కేసుల్లో ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
మొత్తానికి చూస్తే వైసీపీ ప్రభుత్వం దూకుడుకు హైకోర్టు కళ్లెం వేసిందని చెప్పుకోవచ్చు. మరి 26న ఏం తేలుతుందో ఏమోనని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పటికే అటు మండలిలో చైర్మన్ షరీఫ్ ఇచ్చిన షాక్ నుంచి కోలుకోకమునుపే హైకోర్టు ఊహించని షాకిచ్చినట్లయ్యింది. ఇలా వరుస షాక్‌లతో అధికార పార్టీ నేతలు, మంత్రులు ఆలోచనలో పడ్డారు. ఫైనల్‌గా ప్రభుత్వం.. హైకోర్టు ఏం చేయబోతున్నాయనే దానిపై క్లారిటీ రావాలంటే 26 వరకు వేచి చూడక తప్పదు మరి.