తెలంగాణ ఎన్నికల సంఘానికి హైకోర్టు షాక్..

  • IndiaGlitz, [Friday,December 04 2020]

జీహెచ్ఎంసీ కౌంటింగ్‌లో స్వస్తిక్ ముద్రతో పాటు ఏ గుర్తు ఉన్నా ఓటుగా పరిగణించాలంటూ నిన్న రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది. దీనిపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా... ఈసీ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు.. జీహెచ్ఎంసీ కౌంటింగ్‌లో స్వస్తిక్ గుర్తు కాకుండా, ఏ గుర్తు ఉన్నా ఓటుగా పరిగణించాలన్న ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసింది. కోర్టు తదుపరి ఉత్తర్వులకు లోబడే ఫలితాలు విడుదల చేయాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.

జీహెచ్ఎంసీ కౌంటింగ్ విషయమై ఎన్నికల సంఘం జారీ చేసిన సర్క్యూలర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హైకోర్టును ఆశ్రయించారు. బ్యాలెట్‌పై స్వస్తిక్‌ గుర్తుతో పాటు మార్కర్ పెన్‌తో టిక్ చేసినా పరిగణలోకి తీసుకోవాలని అధికారులకు గత రాత్రి ఎస్‌ఈసీ సర్క్యూలర్ జారీ చేసింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో బీజేపీ హౌస్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ప్రగతి భవన్ నుంచి ఆదేశాల మేరకే ఎస్‌ఈసీ సర్క్యూలర్ జారీ చేశారని ఆరోపించారు. కౌంటింగ్ అధికారులకు మాత్రమే సర్క్యూలర్ ఇవ్వడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఎస్‌ఈసీ పార్థసారథి గ్యాంబులర్ అని బండి సంజయ్ విమర్శించారు.