High Court:ఎమ్మెల్సీల నియామకంలో రేవంత్ సర్కార్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ
Send us your feedback to audioarticles@vaarta.com
ఎమ్మెల్సీల నియామకాలపై రేవంత్ర రెడ్డి ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. శాసనమండలిలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, ఆమీర్ అలీఖాన్‌లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. మళ్లీ కొత్తగా ఎమ్మెల్సీల నియామకం చేపట్టాలని తీర్పు ఇచ్చింది. ఎమ్మెల్సీల పేర్లను మళ్లీ కేబినెట్‌లో ప్రతిపాదించి గవర్నర్‌కు పంపాలని ఆదేశించింది. అలాగే దాసోజు శ్రవణ్, సత్యనారాయణల నియామకాన్ని కొట్టి వేసే అధికారం గవర్నర్‌కు లేదని పేర్కొంది. ఏమైనా సమస్యలు ఉంటే కేబినెట్‌కు తిప్పి పంపాలి తప్ప తిరస్కరించొద్దని సూచించింది.
కాగా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, సత్యనారాయణను కేబినెట్ నామినేట్ చేసింది. ఈ ఇద్దరి పేర్లను ఆమోదించాలని గవర్నర్ తమిళి సై సౌందర్‌రాజన్‌కు పంపారు. ఎమ్మెల్సీలుగా ఎంపిక చేసేందుకు ఇద్దరికీ అర్హతలు లేవని తిరస్కరించారు. దీంతో నియామక ప్రక్రియ నిలిచిపోయింది. గవర్నర్ నిర్ణయాన్ని శ్రవణ్, సత్యనారాయణలు హైకోర్టులో సవాల్ చేశారు. ఇంతలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్‌ను ప్రభుత్వం నియమించింది. వీరి నియామకాలను గవర్నర్ తమిళిసై కూడా ఆమోదించారు.
అయితే ఈ క్రమంలోనే ఈ పిటిషన్ విచారణకు రాగా కోదండరామ్, అమీర్ అలీఖాన్ ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేక్ వేసింది. మంత్రి మండలి తీర్మానం చేసి పంపిన పేర్లను గవర్నర్ తిరస్కరించారని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. అయితే గత ప్రభుత్వ హయాంలో మంత్రి మండలి చేసిన తీర్మానాన్ని కొత్త ప్రభుత్వం రద్దు చేసిందని గవర్నర్ కార్యదర్శి తరఫు న్యాయవాది తెలిపారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు ప్రభుత్వం జారీ చేసిన గెజిట్‌ను కొట్టివేసింది. ఎమ్మెల్సీల నియామకంపై ప్రభుత్వం పున:సమీక్షించుకోవాలని సూచించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout