ఇది మానవత్వమేనా?.. ధిక్కరణ నోటీసులిస్తాం: తెలంగాణ హైకోర్టు వార్నింగ్

  • IndiaGlitz, [Tuesday,May 11 2021]

తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో అత్యవసర విచారణ జరిగింది. రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా పరిస్థితి దారుణంగా తయారవుతోంది. ఈ నేపథ్యంలో రేపు జరగాల్సిన విచారణను అత్యవసర పరిస్థితి కాబట్టి హైకోర్టు నేడే నిర్వహించింది. ఉదయం 10:30కి సీజే హిమా కోహ్లి ధర్మాసనం కరోనా పరిస్థితులపై విచారణ చేపట్టింది. ఈ విచారణకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లతో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్ హాజరయ్యారు. రాష్ట్రంలో కరోనా పరీక్షలు తగ్గించడంపై ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర స్థాయిలో ఫైర్ అయింది. కోర్టు ధిక్కరణ నోటీసులు ఇస్తామని ప్రభుత్వాన్ని హిమా కోహ్లి ధర్మాసనం హెచ్చరించింది. పాతబస్తీలో నిబంధనలు పాటించడం లేదన్న హైకోర్టు.. లాక్‌డౌన్‌ విధిస్తారా? లేదంటే నిబంధనలు కఠినతరం చేస్తారా? అని ప్రశ్నించింది. మధ్యాహ్నం కేబినెట్‌ భేటీ ఉందని కోర్టుకు అడ్వకేట్ జనరల్(ఏజీ) ప్రసాద్ తెలిపారు.

అంబులెన్స్‌లను ఆపడం మానవత్వమా?

ఇంటర్ స్టేట్స్ బార్డర్స్ నుంచి వస్తున్న అంబులెన్స్‌లను ఎందుకు అవుతున్నారని హైకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇతర రాష్టాల నుంచి అంబులెన్స్‌లో వస్తున్న వారికి టెస్టులు చేయమని మాత్రమే చెప్పామని... వారిని అపమని మీకు ఎవరు చెప్పారంటూ హైకోర్టు ఫైర్ అయింది. అసలలా ఆపడం మానవత్వమేనా? అంటూ మండిపడింది. అంబులెన్స్ రేట్లను నియంత్రించాలని చెప్పాం చేశారా? అని ప్రశ్నించింది. హైదరాబాద్, రంగారెడ్డిలలో కేసులు తగ్గాయని ఎలా చెపుతున్నారని ప్రశ్నించింది. టెస్టులు తగ్గించి కేసులు తగ్గాయని ఎలా చెపుతారంటూ మండిపడింది. పాతబస్తి ప్రాంతాల్లో ప్రజలు రోడ్ల మీద గుంపులు గుంపులుగా తిరుగుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. మతపరమైన కార్యక్రమాలను ఎందుకు నియంత్రించడం లేదని మండిపడింది.

లాక్‌డౌన్ అవసరం లేదని సీఎస్ ఎలా చెబుతారు?

నేటి మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్‌ భేటీ జరగనుందని.. అనంతరం లాక్‌డౌన్‌, కర్ఫ్యూపై వివరాలు సమర్పిస్తామని కోర్టుకు ఏజీ తెలిపారు. లాక్‌డౌన్‌పై సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఆక్సిజన్ ప్రమాదాలపై సరైన వివరణ ఇవ్వాలని హై కోర్టు తెలిపింది. పూర్తి వివరణ ఇవ్వాలంటూ మధ్యాహ్నం 2:30కు విచారణను వాయిదా వేసింది. తాము ఆదేశాలిచ్చిన రోజే ప్రెస్ మీట్‌లు పెట్టి లాక్‌డౌన్ అవసరం లేదని తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ ఎలా చెబుతారని హైకోర్టు మండిపడింది.
తాము లాక్‌డౌన్ గురించి పరిశీలించండి అన్నప్పుడు అలాంటిది అవరసం లేదు అని సీఎస్ ఎలా చెబుతారని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. రంజాన్ పండుగ అయ్యాక ప్రభుత్వం లాక్‌డౌన్ పెట్టాలనుకుంటుందా? అని హైకోర్టు నిలదీసింది. మధ్యాహ్నం కేబినెట్ సమావేశం జరుగనున్నందున అప్పటి వరకూ విచారణను వాయిదా వేయాలని కోరారు. దీంతో కేసు విచారణను కోర్టు మధ్యాహ్నం 2:30కు వాయిదా వేసింది.