ఓవర్ నైట్‌లో ఆర్టీసీ విలీనం ఎలా..? రేపు తేల్చేస్తామన్న హైకోర్టు!
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో సోమవారం నాడు హైకోర్టులో సుధీర్ఘ విచారణ జరిగింది. ఆర్టీసీ తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. కార్మిక సంఘాలు విలీనం సహా అన్ని డిమాండ్లపై చర్చకు పట్టుబట్టాయని, కోర్టు ఆదేశాల ప్రకారం 21 డిమాండ్లపై చర్చిద్దామంటే వినలేదని, చర్చలు జరపకుండానే యూనియన్ నేతలు బయటకు వెళ్లిపోయారని అడ్వకేట్ జనరల్ కోర్టుకు వివరించారు.
యూనియన్ తరపు న్యాయవాది..
‘ప్రభుత్వం ఒక్క డిమాండ్ పైనే పట్టుబట్టడం సరికాదని హైకోర్టు పేర్కొన్నప్పటికీ.. కోర్టు ఆదేశాలను అర్టీసీ అధికారులు తప్పుగా అన్వయించుకున్నారు. 21 డిమాండ్లపైనే చర్చిస్తామంటూ.. ఇతర డిమాండ్లను పట్టించుకోలేదు’ అని యూనియన్ తరపు న్యాయవాది దేశాయి ప్రకాశ్ రెడ్డి కోర్టుకు తెలిపారు. ఇందుకు కోర్టు స్పందిస్తూ.. కార్పోరేషన్‌పై ఆర్థికభారం పడని డిమాండ్లపై చర్చలు సాగాలని చెప్పింది. మొదట యూనియన్ పేర్కొన్న 21 డిమాండ్లపై చర్చలు సాగితే.. కార్మికుల్లో ఆత్మస్ఘైర్యం కలుగుతుందని హైకోర్టు స్పష్టం చేసింది.
రేపటికి వాయిదా..!
అనంతరం ఈ విచారణను హైకోర్టు రేపటికి అనగా మంగళవారానికి వాయిదా వేసింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం తమకు ఎల్లుండివరకు గడువు కావాలని కోరగా.. కుదరదని తేల్చిచెప్పిన కోర్టు రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు మరోసారి విచారణ చేపడతామని తేల్చిచెప్పింది. కాగా.. కార్మికుల సమ్మె కారణంగా ఆర్టీసీకి రూ.175 కోట్ల నష్టం వచ్చిందని.. రాజకీయ పార్టీలు కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నాయని చర్చల వివరాలను తెలుపుతూ అదనపు అడ్వకేట్ జనరల్ అదనపు కౌంటర్ దాఖలు చేశారు.
కోర్టుకు తెలపరా!?
ఈడీల కమిటీ 21 అంశాలను పరిశీలించి ఆర్టీసీ ఎండీకి నివేదిక సమర్పించిందని అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు కోర్టుకు తెలిపారు. వీటిలో 18 డిమాండ్లను నెరవేర్చడానికి సరిపడా నిధులు సంస్థ వద్దలేవని ఈడీ నివేదికలో పేర్కొందని తెలిపారు. మరి ఈడీ కమిటీ నివేదిక తమకెందుకు సమర్పించలేదని కోర్టు ప్రశ్నించింది. నివేదికలు కోర్టుకు కూడా తెలపరా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించాలని కోర్టు వ్యాఖ్యానించింది. ఓవర్ నైట్‌లో ఆర్టీసీ విలీనం ఎలా జరుగుతుందంటూ హైకోర్టు ప్రశ్నించింది. కార్మికుల డిమాండ్లు సాధ్యం కాదని ముందే నిర్ణయం తీసుకున్నారా? అని హైకోర్టు వ్యాఖ్యానించింది.
నీటి బొట్టే..!
ఆర్టీసీకి రియింబర్స్ చేయాల్సింది రూ 4వేల 900 కోట్లు మాత్రమేనని.. కార్మికుల డిమాండ్లు తీర్చడానికి అయ్యే ఖర్చు రూ. 47 కోట్లు అని హైకోర్టు తేల్చింది. ప్రభుత్వం ఇవ్వాల్సిన దానితో పోల్చితే ఇది నీటి బొట్టేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. నాలుగు డిమాండ్ల పరిష్కారానికి రూ. 47 కోట్లు ఇవ్వగలరో లేదో రేపు చెప్పండని కోర్టు ఈ సందర్భంగా చెప్పింది. మరి రేపు జరగనున్న చర్చల్లో కోర్టు ఏం తేల్చుతుందో..? యూనియన్, ఆర్టీసీ తరఫున న్యాయవాదులు ఏం మాట్లాడుతారో..? రేపటితో సమ్మె ముగుస్తుందా లేకుంటే మరింత ఉదృతం అవుతుందో అనేది తేలిపోనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments