విశాల్‌కు హైకోర్టు నోటీసులు
- IndiaGlitz, [Tuesday,September 22 2020]
హీరో, నిర్మాత అయిన విశాల్ దర్శకుడిగా మారి 'డిటెక్టివ్ 2' చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కంటే ముందు విశాల్ హీరోగా, నిర్మాతగా ఎం.ఎస్.ఆనంద్ దర్శకత్వంలో చేస్తోన్న చిత్రం 'చక్ర'. ఈసినిమాను దక్షిణాది భాషల్లో రూపొందిస్తున్నారు. థియేటర్స్ ఓపెన్ కాకపోవడంతో ప్రస్తుత పరిస్థితులను అనుసరించి హీరో, నిర్మాత విశాల్ తన 'చక్ర' చిత్రాన్ని ఓటీటీలో దీపావళికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే నిర్మాణ సంస్థ ట్రైడెంట్ ఆర్ట్స్ విశాల్ 'చక్ర' సినిమాను ఆపాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. కేసును పరిశీలించిన మద్రాస్ హైకోర్టు విశాల్‌కు, డైరెక్టర్ ఆనంద్‌కు వివరణ కోరుతూ నోటీసులు పంపింది.
అసలేం జరిగిందనే విషయంలోకి వెళితే.. విశాల్ హీరోగా నటించిన చిత్రం 'యాక్షన్'. ఈ సినిమా విడుదల సమయంలో సినిమా రూ.20 కోట్లు కలెక్ట్ చేస్తుందనే అగ్రిమెంట్‌పై విశాల్ సంతకం చేశారు. సినిమాకు రూ.44 కోట్ల బడ్జెట్ అయ్యింది. తీరా సినిమా విడుదలయ్యాక తమిళనాడులో 7.7కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో రూ.4కోట్ల వసూళ్లను సాధించింది. దీంతో విశాల్ నష్టాలను భర్తీ చేయడానికి తన తదుపరి చిత్రాన్ని ట్రైడెంట్ ఆర్ట్స్ బ్యానర్‌లో ఆనంద్ దర్శకత్వంలో చేస్తానని మాటిచ్చారు. సినిమా చేయలేదు సరికదా.. చేసిన చక్ర సినిమాను ఓటీటీలో విడుదల చేయడానికి రెడీ అయ్యారు. దీనిపై ట్రైడెంట్ ఆర్ట్స్ సంస్థ తమకు విశాల్ ఇవ్వాల్సిన రూ.8.29 కోట్లు చెల్లించే వరకు 'చక్ర' సినిమా విడుదలను ఆపాలంటూ కేసు వేసింది.