హైకోర్టు షాక్ : వైసీపీ ఎంపీ, ఆమంచి సహా 49 నోటీసులు
- IndiaGlitz, [Tuesday,May 26 2020]
న్యాయస్థానాలు, న్యాయవాదులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. అలాంటిది అన్నీ తెలిసిన అది కూడా ప్రజా ప్రతినిధులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఏపీ హైకోర్టు కన్నెర్రజేసింది. అధికార వైఎస్సార్ పార్టీ ఎంపీ నందిగాం సరేష్ (బాపట్ల), మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సహా 49 మంది చేసిన ఈ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న హైకోర్టు మంగళవారం రాత్రి నోటీసులు జారీ చేసింది. లక్ష్మీనారాయణ అనే న్యాయవాది ఈ వ్యవహారంపై హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేయగా దాన్ని పరిగణనలోనికి తీసుకున్న న్యాయస్థానం ఇవాళ విచారణ చేపట్టింది. విచారణ అనంతరం న్యాయస్థానం ఈ నోటీసులు పంపింది. తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. నిజంగా ఇది అధికార పార్టీకి మరో షాకే అని చెప్పుకోవచ్చు.
అసలెందుకీ నోటీసులు.. ఏం జరిగింది!?
ఇటీవల డా. సుధాకర్ కేసును సీబీఐకి అప్పగించడం, ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు, ఐపీఎస్ ఆఫీసర్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఎత్తివేయడం లాంటి విషయంలో వ్యతిరేక తీర్పులు వెలువరించింది. ఇలా ఏపీ ప్రభుత్వానికి ఒకే రోజే మూడు విషయాల్లో ఎదురుదెబ్బలు తగిలిన విషయం విదితమే. దీంతో అధికార పార్టీకే ఇలా ప్రభుత్వం చేయడం ఎంతవరకు సబబు..? అంటూ న్యాయమూర్తులపై కొందరు నెటిజన్లు, వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు సహనం కోల్పోయిన ఎంపీ నందిగాం సరేష్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కూడా మీడియా ముఖంగా హైకోర్టు, న్యాయమూర్తులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజా ప్రతినిధులు అయ్యుండి ఇలా చేయడం గమనార్హం. ఈ వ్యవహారాన్ని నిశితంగా పరిశీలించిన లక్ష్మీనారాయణ హైకోర్టులు పిటిషన్ వేశారు.
పిటిషనర్ ఏమంటున్నారు..!?
న్యాయమూర్తులను ఉద్ధేశపూర్వకంగా కించపరిచారని.. సామాజిక మాధ్యమాల్లో అసభ్యంగా పలువురు పోస్టులు చేశారని లక్ష్మీ నారాయణ న్నారు. కోర్టులను రాజకీయాలకు వేదికగా చేసుకోవడం.. లేనిపోని వ్యాఖ్యలు చేసి వాటిని కోర్టులకు ఆపాదించడం తనకు బాధకలిగించిందని మీడియాకు వివరించారు. ఈ వ్యాఖ్యల వెనుక ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారని వీళ్లంతా కోర్టులను భయబ్రాంతులకు గురిచేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని లక్ష్మీ నారాయణ అన్నారు.
ఇవాళే ప్రభుత్వానికి మరో షాక్..
ఇదిలా ఉంటే.. 49 మంది నోటీసులిచ్చిన అనంతరం ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులపై సెలెక్ట్ కమిటీని నియమించకపోవడంపై దాఖలైన పిటిషన్‌ను ఈరోజు హైకోర్టు విచారించింది. ఈ పిటిషన్‌ను టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి దాఖలు చేయగా.. పిటిషన్ తరపున సీనియర్ లాయర్ ఉన్నం మురళీధర్ వాదనలను వినిపించారు. ఈ సందర్భంగా ఆయన వాదనలను వినిపిస్తూ శాసనమండలి ఛైర్మన్ ఆదేశాలను ధిక్కరించే అధికారం ఎవరికీ లేదని అన్నారు. వాదనలు విన్న అనంతరం ప్రభుత్వం తరపున అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, శాసనమండలి కార్యదర్శికి నోటీసులు పంపింది. ఈ వ్యవహారం అనంతరం తదుపరి విచారణను వచ్చే నెల 22కి వాయిదా వేసింది.
సుప్రీంలో ఏం తేలుతుందో..!?
ఇలా ప్రభుత్వానికి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. కాగా.. గత కొన్నిరోజులుగా జరుగుతున్న పరిణామాలపై, మరీ ముఖ్యంగా వైజాగ్ డాక్టర్ సుధాకర్ కేసులో సీబీఐ విచారణకు ఏపీ హైకోర్టు ఆదేశించడంపై.. హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంశానికి సంబంధించి న్యాయ నిపుణుల సలహాలను తీసుకుంటోంది. సుప్రీంకోర్టుకు వెళితే పరిస్థితేంటి..? సుప్రీం కూడా మొట్టికాయలు వేస్తుందా..? లేకుంటే హైకోర్టు తీరును తప్పుబడుతుందా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.