చంద్రబాబు ‘ఎమ్మెల్యే’ పదవికి వైసీపీ ఎసరు.. మాస్టర్ ప్లాన్!?
- IndiaGlitz, [Sunday,September 29 2019]
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పం నుంచి పోటీ చేసి గెలిచిన సంగతి తెలిసిందే. రాయలసీమ మొత్తమ్మీద కేవలం మూడే మూడు నియోజకవర్గాల్లో మాత్రమే టీడీపీ గెలిచింది. అయితే ఈ ముగ్గురిలో చంద్రబాబు కూడా ఒక్కరు. బాబును నానా ఇబ్బందుల్లోకి నెట్టాలని వైసీపీ ప్రభుత్వం అనుకుంటోందో..? లేకుంటే బాబును ముప్పుతిప్పలు పెట్టాలని అనుకుంటోందో తెలియదు కానీ.. ఆది నుంచి అన్నీ ఇబ్బందులకే గురిచేస్తోందని తెలుగు తమ్ముళ్లు గగ్గోలు పెడుతున్నారు. ఇది కక్ష్యతో చేస్తోందా..? లేకుంటే న్యాయ బద్ధంగా వెళ్తోందా అనేది ఇక్కడ అప్రస్తుతం.. అసందర్భం.
అసలు కథ ఇదీ!
ఇక అసలు విషయానికొస్తే.. 2019 ఎన్నికల సమయంలో ఎన్నికల పిటిషన్‌కు సంబంధించి చంద్రబాబుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కుప్పం నియోజకవర్గం నుంచి ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఎమ్మెల్యేగా పోటీ చేశారని పిటిషన్ దాఖలైంది. దీన్ని నిశితంగా పరిశీలించిన హైకోర్టు ఈ నోటీసులను జారీ చేసింది. కాగా ఈ పిటిషన్‌ను గత ఎన్నికల్లో పోటీచేసిన చంద్రబాబుపై వైసీపీ అభ్యర్థి చంద్రమౌళి తరపున ఎన్నికల ఏజెంట్‌గా వ్యవహరించిన విద్యాసాగర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల అఫిడవిట్లో చంద్రబాబు ఆదాయాన్ని గోప్యంగా ఉంచారని పిటిషన్లో పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి సీఎంగా పొందిన జీతం గురించి ప్రస్తావించలేదని.. ఈ కారణంతో చంద్రబాబు ఎన్నిక రద్దు చేయాలని పిటిషనర్ కోరారు. అయితే ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ మానవేంధ్రనాథ్ రాయ్ ఆదేశాలిచ్చారు.
గోప్యం ఎందుకు!?
ఇదిలా ఉంటే.. చంద్రబాబు తన ఎన్నికల అఫిడవిట్లో ఆదాయ మార్గాలు గోప్యంగా ఉంచారు. ప్రభుత్వ నిధుల నుంచి సీఎంగా ఆయన పొందిన జీతం గురించి ఎక్కడా పేర్కొనలేదని హైకోర్టులో పిటిషన్ తన వృత్తి సామాజిక సేవ అని, జీతాన్ని ఆదాయ మార్గంగా చంద్రబాబు తెలపకపోవడంతో వైసీపీ అభ్యర్థి తరఫున పిటిషన్ దాఖలైంది. కాగా.. ఎన్నికల అఫిడవిట్ దాఖలు చేసే నాటికి చంద్రబాబు సీఎంగా ఉన్నారన్న విషయం తెలిసిందే.
చంద్రబాబు పరిస్థితి తేలితే.. !!
అయితే ఈ వ్యవహారంపై ఇంతవరకూ టీడీపీ అధినేత కానీ.. పార్టీకి చెందిన నేతలు గానీ మీడియా ముందుకు రాలేదు. అంతేకాదు చంద్రబాబు, నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా కూడా స్పందించలేదు. రియాక్షన్ లేదంటే అర్థమేంటో ఆ ఇద్దరికే తెలియాలి. మొత్తానికి చూస్తే.. చంద్రబాబుకు ఉన్న ఎమ్మెల్యే పదవిని పీకేయడానికి వైసీపీ మాస్టర్ ప్లాన్ వేసిందని స్పష్టంగా అర్థమవుతోంది. కాగా ఇప్పటికే టీడీపీ తరఫున గెలిచిన పలువురు ఎమ్మెల్యేలపై హైకోర్టు, పోలీస్ స్టేషన్లలో వైసీపీ అభ్యర్థులు ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే. ఇంకా ఈ కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తమ్మీద చంద్రబాబు వ్యవహారంలో పరిస్థితి ఎలా ఉంటుందో..? ఏమో తెలిస్తే గానీ.. మిగతా ఎమ్మెల్యేలు ఎన్నికపై తేలిపోనుంది. దీనిపై క్లారిటీ రావాలంటే నాలుగు వారాలు వేచి చూడాల్సిందే మరి.