జంట హత్యల కేసుపై హైకోర్టు విచారణ
Send us your feedback to audioarticles@vaarta.com
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్రావు జంట హత్యల కేసుపై హైకోర్టు విచారణ నిర్వహించింది. న్యాయవాదుల హత్యపై హైకోర్టు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అడ్వకేట్ వామన్ రావు, అతని సతీమణి నాగమణి హత్య కేసును హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ హత్యకు సంబంధించిన అన్ని ఆధారాలు పగడ్బందీగా సేకరించాలని అడ్వకేట్ జనరల్ని హైకోర్టు ఆదేశించింది. మార్చి 1 లోపు సమగ్రమైన నివేదిక సమర్పించాలని ఏజీని ఆదేశించింది. ప్రభుత్వానికి, పోలీస్ శాఖకు హైకోర్టు నోటిసులు జారీ చేసింది.
హత్య జరిగినచోట అన్ని ఆధారాలను సేకరించి కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలపాలని హైకోర్టు సూచించింది. హత్య జరిగిన వెంటనే పోలీస్ శాఖ అప్రమత్తమైందని కోర్టుకు అడ్వకేట్ జనరల్ తెలిపారు. హంతకులను అతి త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని హైకోర్టుకు చెప్పారు. రాష్ట్ర ప్రజలంతా కూడా ప్రభుత్వం వైపు చూస్తున్నారని హైకోర్టు తెలిపింది. ప్రభుత్వం పైన న్యాయ వ్యవస్థ పైన ప్రజలకు నమ్మకం కలగాలంటే తప్పనిసరిగా ఈ కేసులో అన్ని ఆధారాలనూ సేకరించాలని హైకోర్టు తెలిపింది. పగడ్బందీగా ఆధారాలు సేకరించి వాటిని చాలా జాగ్రత్తగా భద్ర పరచాలని సూచించింది.
హత్య జరిగిన సమయంలో రెండు ఆర్టీసీ బస్సులు కూడా ఉన్నాయని హైకోర్టు తెలిపింది. ఆర్టీసీ బస్సులో ఉన్న ప్రయాణికులను ఐడెంటిఫై చేసి వాళ్ళని కూడా సాక్షులుగా తీసుకోవాలని హైకోర్టు సూచించింది. సోషల్ మీడియాలో కూడా హత్యలు చిత్రీకరించిన కొన్ని క్లిప్స్ వస్తున్నాయని.. వాటిని వెరిఫై చేసి దాన్ని కూడా సాక్ష్యంగా భద్రపరచాలని హైకోర్టు సూచించింది. ఇది రాష్ట్ర ప్రతిష్టకు, ప్రజల భద్రతకు సంబంధించిన కేసుగా చూడాలని ఏజీకి హైకోర్టు తెలిపింది. తదుపరి విచారణను మార్చి 1 కి హైకోర్టు వాయిదా వేసింది. మరోవైపు ఈ హత్యలను నిరసిస్తూ న్యాయవాదులంతా విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout