ఉత్కంఠకు తెర.. ఏపీలో పరిషత్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్
Send us your feedback to audioarticles@vaarta.com
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్రంలో పరిషత్ ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను డివిజన్ బెంచ్ కొట్టేసి.. ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. షెడ్యూల్ ప్రకారమే పరిషత్ ఎన్నికలు నిర్వహించుకోవచ్చని.. అయితే తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ కౌంటింగ్‌ను మాత్రం నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సింగిల్ జడ్జి వద్దకు వెళ్లి పిటిషన్‌ను పరిష్కరించుకోవాలని ధర్మాసనం సూచించింది. దీంతో ఏప్రిల్ 8న యథావిధిగా పరిషత్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ కేసులో ఎస్ఈసీ తరఫున సీవీ మోహన్ రెడ్డి వాదనలు వినిపించగా, పిటిషనర్ వర్ల రామయ్య తరపున సీనియర్ న్యాయవాది వేదుల వెంకట రమణ, ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రమణ్యం వాదనలను వినిపించారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై సింగిల్ బెంచ్ ఆదేశాలను డివిజన్ బెంచ్‌లో ఎస్ఈసీ కార్యదర్శి కన్నబాబు సవాల్ చేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు పరిశీలనలోకి తీసుకుంది. ఈ మేరకు హైకోర్టులో డివిజన్ బెంచ్ ఎదుట వాదనలు జరిగాయి. పిటిషన్ వేసిన వర్ల రామయ్య ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి కాదని, వ్యక్తిగత హోదాలో వేసిన పిటిషన్‌ను సింగిల్ బెంచ్ కొట్టేసి ఉండాల్సిందని పేర్కొంది. నాలుగు వారాలు కోడ్ ఉండాలని నిబంధన లేదని ఎస్‌ఈసీ తెలిపింది. కోడ్ నిబంధన ఈ ఎన్నికలకు వర్తింప జేయాల్సిన అవసరం లేదని కోర్టుకు వెల్లడించింది. సుప్రీంకోర్టు ఏ సందర్భంలో ఆ ఉత్తర్వులు ఇచ్చిందో పరిగణనలోకి తీసుకోలని ఎస్‌ఈసీ పేర్కొంది.
కోడ్ అమలుతో ప్రభుత్వ కార్యక్రమాలు ఆగిపోతాయని వ్యాఖ్యానించింది. వీటిని పరిగణనలోకి తీసుకొని సింగిల్ బెంచ్ ఉత్తర్వులు కొట్టేయాలని ఎస్‌ఈసీ కోరింది. కాగా.. పిటిషన్‌లో సరైన వివరాలు లేవని ఎస్‌ఈసీపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సరైన పేపర్లతో మధ్యాహ్నం 12 గంటలకు కోర్టు ముందుకు రావాలని ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది. మధ్యాహ్నం మరోమారు వాదనలు విన్న అనంతరం.. సింగిల్ జడ్జి ఉత్తర్వులను కొట్టివేస్తూ తీర్పును వెలువరించింది. ఈ తీర్పు నేపథ్యంలో రేపటి పోలింగ్ కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే పోలింగ్ సిబ్బంది సైతం ఎన్నికల సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు తరలి వెళుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Iniya Vaishnavi
Contact at support@indiaglitz.com
Comments