రఘురామకు తీవ్ర గాయాలు..హైకోర్టు డివిజనల్ బెంచ్ ఫైర్
Send us your feedback to audioarticles@vaarta.com
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఒంటిపై గాయాలుడటం సంచలనంగా మారింది. తనను సీఐడీ పోలీసులు తీవ్రంగా కొట్టారని న్యాయవాదులకు ఎంపీ తెలిపారు. ఈ మేరకు జడ్జికి లిఖిత పూర్వకంగా లేఖ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రిమాండ్ రిపోర్టును మెజిస్ట్రేట్ తిప్పి పంపారు. మరోవైపు లాయర్ ఆదినారాయణరావు హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. రఘురామకృష్ణరాజు కోర్టును తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. రఘురామ పిటిషన్‌ను హైకోర్టు మధ్యాహ్నం డిస్మిస్ చేసిందన్నారు. మధ్యాహ్నం ఆయనకు కుటుంబసభ్యులు భోజనం తీసుకొచ్చినప్పుడు ఆయన మామూలుగానే ఉన్నారన్నారు. పిటిషన్ డిస్మిస్ కాగానే రఘురామ కొత్త నాటకానికి తెరతీశారని పొన్నవోలు తెలిపారు. పోలీసులు కొట్టారంటూ సాయంత్రం కోర్టులో కట్టుకథ అల్లారన్నారు. రఘురామ ఆరోపణలపై కోర్టు మెడికల్ కమిటీ వేసిందన్నారు. రేపు మధ్యాహ్నంలోగా పరిశీలన చేసి నివేదిక ఇవ్వాలని సూచించిందని పొన్నవోలు తెలిపారు.
రఘురామ కేసుకు సంబంధించిన స్పెషల్ మూవ్ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. రఘురామరాజు కాలి దెబ్బల ఫొటోలు చూసిన హైకోర్టు డివిజనల్ బెంచ్ పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిన్న లేని గాయాలు ఇవాళ ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించింది. రఘురామ శరీరంపై దెబ్బలు తాజావేనని తేలితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మెజిస్ట్రేట్ కోర్టులో ఏం జరిగిందో తెలుసుకుని అరగంటలో ఉత్తర్వులిస్తామని తెలిపింది. ఈ క్రమంలోనే రఘురామకు కేంద్రం కల్పించిన వై కేటగిరి భద్రత కొనసాగించాలని ఆయన తరపు న్యాయవాది సీనియర్ లాయర్ ఆదినారాయణరావు కోరారు. రఘురామ కుటుంబ సభ్యులను కూడా అనుమతించాలని కోరారు. అలాగే మెడికల్ నివేదిక రేపు ఉదయం 10:30లోపు ఇచ్చేలా చూడాలని కోర్టును కోరారు.
రఘురామకు గుంటూరులోని సీఐడీ న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నెల 28 వరకూ ఆయనకు రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఆయన కాళ్లపై గాయాలుండటంతో ఎంపీని ఆసుపత్రికి తరలించాలని ఆదేశించింది. ముందుగా జీజీహెచ్.. ఆ తర్వాత రమేశ్ ఆసుపత్రికి తరలించాలని సూచించింది. ఆయన కోలుకునే వరకూ ఆసుపత్రిలో ఉండొచ్చని తెలిపింది. ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతున్నంత వరకూ ఆయనకు వై కేటగిరీ భద్రత కొనసాగుతుందని తెలిపింది. ఆయన శరీరంపై కనిపిస్తున్న గాయాలపై న్యాయస్థానం నివేదిక కోరింది. రెండు ఆసుపత్రుల్లో మెడికల్ ఎగ్జామినేషన్‌కు కోర్టు ఆదేశించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout