హైకోర్టు న్యాయవాది దంపతుల దారుణ హత్య
- IndiaGlitz, [Wednesday,February 17 2021]
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. హైకోర్టు న్యాయవాది దంపతులను సుమారు వంద మంది చూస్తుండగానే విచక్షణారహితంగా నరికి చంపేశారు. రామగిరి మండలం కలవచర్ల గ్రామంలో ఈ దారుణం జరిగింది. స్వగ్రామానికి వచ్చి కారులో తిరిగి హైదరాబాద్‌కు వెళ్తున్న హైకోర్టు న్యాయవాది గట్టు వామన్‌రావు, నాగమణి దంపతులను కల్వచర్ల పెట్రోల్ బంకు వద్ద గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించారు. కారు ఆపిన వెంటనే వామన్‌రావు, నాగమణి దంపతులపై దాడికి పాల్పడ్డారు. కారులోనే నాగమణి ఉండిపోగా.. కారు దిగిన వామన్‌రావును అందరూ చూస్తుండగానే విచక్షణా రహితంగా నరికేశారు.
రెండు ఆర్టీసీ బస్సులలోని ప్రయాణికులు, ఇతర వాహనదారులు చూస్తుండగానే ఈ దారుణం జరిగింది. 108 వాహనంలో వామన్‌రావు దంపతులను పెద్దపల్లిలోని ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యంలో ఇద్దరూ మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు చేపట్టారు. అలాగే వామన్‌రావు కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. వామన్‌రావు స్వగ్రామం మంథని మండలం గుంజపడుగు. వామన్‌రావు దంపతుల హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. తమ గ్రామానికి వచ్చి తిరిగి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో ఈ ఘోరం జరిగింది.
కాగా.. వామన్‌రావు చనిపోవడానికి ముందు టీఆర్ఎస్ మంథని మండల అధ్యక్షుడు కుంట శ్రీనివాస్ పేరును ప్రస్తావించినట్టు తెలుస్తోంది. శ్రీనివాస్ కూడా గుంజెపడుగుకు చెందిన వ్యక్తే కావడం విశేషం. శీలం రంగయ్య అనే వ్యక్తి లాకప్‌డెత్ కేసును వామన్‌రావు వాదించారు. ఈ నేపథ్యంలోనే తమకు శ్రీనివాస్, కుమార్ అనే వ్యక్తులపై అనుమానం ఉన్నట్టు వామన్‌రావు సోదరుడు ఇంద్రశేఖర్ చెబుతున్నారు. మరోవైపు ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని.. ఇప్పటికే నిందితుల కోసం ప్రత్యేక బృందాలను నియమించినట్టు రామగుండం సీపీ సత్యనారాయణ తెలిపారు. నిందితులు ఎంతటి వారైనా వదలబోమని స్పష్టం చేశారు.