'ఎఫ్‌సీయూకే' (ఫాద‌ర్‌-చిట్టి-ఉమా-కార్తీక్‌) లోని 'హే హుడియా' పాట‌ను విడుద‌ల

  • IndiaGlitz, [Sunday,January 31 2021]

జ‌గ‌ప‌తిబాబు ప్ర‌ధాన పాత్ర పోషించ‌గా శ్రీ రంజిత్ మూవీస్ ప‌తాకంపై కె.ఎల్‌. దామోద‌ర్ ప్ర‌సాద్ నిర్మించిన చిత్రం 'ఎఫ్‌సీయూకే' (ఫాద‌ర్‌-చిట్టి-ఉమా-కార్తీక్‌). రామ్ కార్తీక్‌, అమ్ము అభిరామి జంట‌గా, బేబి స‌హ‌శ్రిత మ‌రో కీల‌క పాత్ర‌ధారిగా న‌టించిన ఈ సినిమాకు విద్యాసాగ‌ర్ రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

ఇదివ‌ర‌కు టాలీవుడ్‌లో ఎవ‌రూ చేయ‌ని విధంగా ఈ చిత్రంలోని పాట‌ల‌ను నిజ జీవిత హీరోల‌తో విడుద‌ల చేస్తూ వ‌స్తున్నారు. సినిమా వేడుక‌ల‌ను, ప్రెస్‌మీట్ల‌ను క‌వ‌ర్ చేయ‌డానికి వ‌చ్చే మీడియా సిబ్బందితో ఈ చిత్రంలోని నాలుగో పాట హే హుడియాను విడుద‌ల చేయించ‌డం విశేషం.

కొవిడ్ 19 మ‌హమ్మారిపై మొద‌ట్నుంచీ ముందుండి పోరాటం చేస్తూ, అవిశ్రాంతంగా సేవ‌లందిస్తూ వ‌స్తోన్న వైద్య‌-ఆరోగ్య‌, మునిసిప‌ల్‌, పోలీస్ సిబ్బంది చేతుల మీదుగా మూడు పాట‌ల‌ను చిత్ర బృందం విడుద‌ల చేయించింది. ఆ పాట‌లు సంగీత ప్రియుల‌ను అమితంగా అల‌రిస్తున్నాయి. శ్రీ రంజిత్ మూవీస్ అధినేత కె.ఎల్‌. దామోద‌ర్ ప్ర‌సాద్ మాట్లాడుతూ, త‌మ జీవితాల‌ను ప‌ణంగా పెట్టి, ఎదుటివాళ్ల జీవితాల‌ను కాపాడ్డం కోసం అమూల్య‌మైన సేవ‌లందిస్తూ వ‌స్తున్న కొవిడ్ ఫ్రంట్‌లైన్ వారియ‌ర్స్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుకోవాల‌నే ఉద్దేశంతోటే ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టామ‌న్నారు.

జ‌గ‌ప‌తిబాబు మాట్లాడుతూ, కొవిడ్ ఫ్రంట్‌లైన్ వారియ‌ర్స్‌గా మీడియాకు గుర్తింపు రాలేద‌నీ, అయితే కొవిడ్ మ‌హ‌మ్మారికి సంబంధించిన స‌మాచారాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు ఫీల్డ్‌లో ఉండి అందిస్తూ, అంద‌రినీ అప్ర‌మ‌త్తం చేస్తూ వ‌చ్చింది మీడియా సిబ్బందేన‌నీ అన్నారు. అలాంటి వారి చేతుల మీదుగా ఈ చిత్రంలోని పాట విడుద‌ల కావ‌డం త‌న‌కెంతో ఆనందాన్నిచ్చింద‌ని చెప్పారు.

భీమ్స్ సెసిరోలియో బాణీలు స‌మ‌కూర్చిన హే హుడియా పాట‌ను ఆవిష్క‌రించిన సీనియ‌ర్ ఫిల్మ్ జ‌ర్న‌లిస్టులు సాయిర‌మేశ్‌, నాగేంద్ర‌కుమార్‌.. ఆ పాట‌ను రాగ‌యుక్తంగా ఆల‌పిస్తూ ఆస్వాదించారు. క‌రోనా మ‌హ‌మ్మారిపై పోరాటంలో మీడియా పాత్ర‌ను ప్ర‌శంసించిన హీరో రామ్ కార్తీక్‌, హే హుడియా పాట‌ను విడుద‌ల చేసిన జ‌ర్న‌లిస్టుల‌కు థాంక్స్ చెప్పారు.

డైరెక్ట‌ర్ విద్యాసాగ‌ర్ రాజు మాట్లాడుతూ, రొమాంటిక్ కామెడీగా రూపొంది, ఫిబ్ర‌వ‌రి 12న థియేట‌ర్ల‌లో విడుద‌ల‌వుతున్న‌ 'ఎఫ్‌సీయూకే' మూవీ క‌చ్చితంగా ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తుంద‌నే న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశారు.

తారాగ‌ణం: జ‌గ‌ప‌తిబాబు, రామ్ కార్తీక్‌, అమ్ము అభిరామి, బేబి స‌హ‌శ్రిత‌, అలీ, దగ్గుబాటి రాజా, కళ్యాణి నటరాజన్, బ్రహ్మాజీ, కృష్ణ భగవాన్, రజిత, జబర్దస్త్ రామ్ ప్రసాద్, నవీన్, వెంకీ, రాఘవ, భరత్‌.