హీరోయిన్స్ వరకు ఓకే..కానీ?

  • IndiaGlitz, [Wednesday,August 30 2017]

శ్రీ సూర్య మూవీస్.. ఈ పేరు వింటే ఒక‌ప్పుడు హిట్ సినిమాలే గుర్తొచ్చేవి. ఎన్నో బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన ఆ సంస్థ అధినేత ఎ.ఎం.ర‌త్నం.. ఇటీవ‌ల కాలంలో సినిమాల సంఖ్య‌ను త‌గ్గించాడు. ఆయ‌న సంగ‌త‌లా ఉంటే.. ఆయ‌న త‌న‌యుడు జ్యోతికృష్ణ ద‌ర్శ‌కుడిగా అదృష్టం ప‌రీక్షించుకుంటూనే ఉన్నాడు కానీ ఒక్క విజ‌యం కూడా వ‌రించ‌లేదు. 14 ఏళ్ల క్రితం ద‌ర్శ‌కుడిగా తొలి అడుగులు వేసిన జ్యోతికృష్ణ‌.. ఇంత జ‌ర్నీలో చేసింది నాలుగు సినిమాలే. తొలి చిత్రాన్నిత‌రుణ్‌, శ్రియ‌, త్రిష‌తో నీ మ‌న‌సు నాకు తెలుసుగా రూపొందించిన జ్యోతి.. రెండో చిత్రాన్ని త‌న త‌మ్ముడు ర‌వికృష్ణ హీరోగా ఇలియానా, త‌మ‌న్నా హీరోయిన్స్‌గా జాదు (త‌మిళంలో కేడి) పేరుతో తెర‌కెక్కించాడు.

త‌మిళంలో రిలీజైన ఈ సినిమా ఇప్ప‌టికీ తెలుగులో రిలీజ్ కానేలేదు. మూడో చిత్రాన్ని త‌మిళంలోనే రూపొందించాడు ఊ ల‌ల‌ల్లా గా. ఇందులో తానే హీరోగా న‌టించాడు. క‌ట్ చేస్తే.. 5 ఏళ్ల గ్యాప్ త‌రువాత త‌న నాలుగో చిత్రాన్ని ఆక్సిజ‌న్‌గా తెర‌కెక్కించాడు. విడుద‌ల విష‌యంలో ప‌లు ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ సినిమా ఎట్ట‌కేల‌కు ఈ అక్టోబ‌ర్ 12న విడుద‌ల కానుంది. గోపీచంద్ హీరోగా న‌టించిన ఈ చిత్రంలో రాశీ ఖ‌న్నా, అను ఎమ్మ‌నియేల్ హీరోయిన్స్‌గా న‌టించారు. ఇప్ప‌టివ‌ర‌కు జ్యోతి కృష్ణ రూపొందించిన అన్ని సినిమాల్లో హీరోయిన్ ఎంపిక అయితే ఫ‌స్ట్ క్లాస్‌. ఎటొచ్చి సినిమాలే ఆడ‌లేదు.. మ‌రి ఆక్సిజ‌న్ అయినా ఆ ట్రాక్ రికార్డ్‌ని మారుస్తుందేమో చూడాలి.