ఎవరు చూపించని యూనిక్ పాయింట్ ని 'తోలుబొమ్మలాట'లో చూపించడానికి ప్రయత్నించాం! - హీరో విశ్వంత్

  • IndiaGlitz, [Saturday,November 16 2019]

కేరింత - మనమంతా - జెర్సీ వంటి ఫీల్ గుడ్ మూవీస్ లో నటించిన యువ నటుడు విశ్వంత్ ఇప్పుడు అదే తరహాలో మరో మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సుమ దుర్గా క్రియేష‌న్స్ ప‌తాకంపై దుర్గా ప్ర‌సాద్ మాగంటి నిర్మాతగా విశ్వ‌నాథ్ మాగంటి దర్శకత్వంలో తెరకెక్కిన తోలు బొమ్మలాట చిత్రంలో విశ్వంత్ కథానాయకుడిగా నటించాడు. న‌ట‌కిరీటి డా. రాజేంద్ర‌ప్ర‌సాద్, వెన్నెల కిషోర్‌, హ‌ర్షిత‌ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పల్లెటూరి నేపథ్యంలో నడిచే ఆహ్లదకరమైన కథగా తెరకెక్కిన ఈ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా హీరో విశ్వంత్ మీడియా తో ముచ్చటించారు .

తోలు బొమ్మలాట ఎలా మొదలైంది?

జెర్సీ సినిమా చేస్తున్నప్పుడు దర్శకుడు విశ్వనాథ్ నాకు కథ చెప్పాలని చాలా మొహమాటంగా అడిగాడు. విశ్వనాథ్ నాకు కేరింత సమయం నుంచి చాలా క్లోజ్ ఫ్రెండ్. నాకు ఎప్పటినుంచో తెలుసు. ఇక జెర్సీ సినిమా చేయడానికి ఒప్పుకోగానే ఆఫీస్ లో కలిసి గత మూడు నెలలుగా ఒక కథ చెప్పాలని అనుకుంటాను అని చాలా కూల్ గా కథ చెప్పాడు. కథ చాలా బాగా నచ్చింది చేసేద్దాం అన్నాను. చాలా మందిని హీరోలుగా అనుకున్నప్పటికి ఫైనల్ గా నన్ను ఫిక్స్ చేశారు. అయితే జెర్సీ సినిమా ఇంకా అప్పటికి పూర్తవ్వలేదు. అప్పుడే తోలుబొమ్మలాట డేట్స్ సెట్ చేసుకున్నారు. రెండు క్లాష్ అవుతున్నాయి. గౌతమ్ తిన్ననూరి తో ముందే 'మళ్ళీ రావా' సినిమా చేయాల్సింది. అది అనుకోకుండా మిస్ అయ్యాను. ఇక జెర్సీ ఏ మాత్రం మిస్ అవ్వకూడదని రెండు మ్యానేజ్ చేయాలని అనుకున్నాం. కొన్ని రోజులు అలా చేసినప్పటికీ వర్కౌట్ కాలేదు.

డేట్స్ క్లాష్ అవుతున్నప్పుడు ఒక సినిమా వదులుకోవా లని అనిపించిందా..?

నేను మొదట ఈ సినిమా కథ కూడా చాలా లైట్ గా విన్నాను. నాకు కొంచెం మొహమాటం. డైలాగ్స్ ట్రాక్ కూడా వినలేదు. నేను ఒక కథ ఒకే చేయడానికి ఒకటికి మూడు సార్లు చదివిగాని ఒకే చేయను. ఎందుకంటే ఎదో ఒకటి చేయాలని ఆలోచించను. సినిమాలకోసం చదువు, అమెరికా అన్ని వదిలేసుకున్నా. మంచి సంపాదన వద్దనుకొని మంచి సినిమాలు చేయాలని అనుకున్నప్పుడు మంచి అవకాశాలను మిస్ చేసుకోకూడదు అనుకున్నా. డైరెక్టర్ కి ముందే చెప్పాను.. ఒకే వేళ డేట్స్ కుదరకపోతే వదిలేస్తాను అని చెప్పాను. ఆల్ మోస్ట్ ప్రాజెక్ట్ వదిలేసే వరకు వచ్చింది. కానీ ఫైనల్ గా మంచి సినిమా చేశాం.

ఈ సినిమాలో మీరు హీరోనా? పాత్రలు ఎలా ఉంటాయి?

ఈ సినిమాలో నాది ఒక క్యారెక్టర్. కథలో ఎవరు హీరో, హీరోయిన్ గా కనిపించరు. ఇలాంటి కథలో అలా కనిపించారు అంటే సినిమా ఫెయిల్ అయినట్లే. ప్రతి ఒక్కరిది ఒక స్పెషల్ క్యారెక్టర్. ఒక తాత ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతాడు. అలాగే మనవడి పాత్ర కూడా అంతే ఉంటుంది. ఫ్యామిలీ డ్రామాలో పాత్రలు కథకు తగ్గట్టు ఉండాలి. అదొక్కటి నేను నమ్ముతాను. హీరో హోరోయిన్ కంటే సినిమా కథ గొప్పది. క్యారెక్టర్లు లిమిటేషన్ లోనే ఉండాలి. అది దాటి వెళ్ళిపోతే సినిమా ప్లాప్ అయినట్లే. అలాంటి ఆలోచనతో సినిమాలు చేయాల్సిన అవసరం లేదు. ఆ చిన్న లాజిక్ గుర్తుపెట్టుకోవాలి. లేదంటే ఇంటికెళ్లిపోవచ్చు.

ఇప్పటివరకు మీరు చేసిన సినిమాల్లో మీ టాలెంట్ కి లీడ్ కి అవకాశం లేకుండా పక్కకు పెద్ద హీరో ఉంటున్నాడు. అది ఇబ్బందిగా అనిపించిందా?

అలా ఏమి అనుకోలేదు. పర్సనల్ గా ఫీల్ అవ్వలేదు. జెర్సీ అనే సినిమా గౌతమ్ అనే పాత్రది. అది కంప్లీట్ గా నాని అన్న సినిమా. అందులో నేను ఒక పార్ట్. ముందే కథ విని ఒప్పుకున్నా. అలాంటి ఫీల్ ఉంటే కథ వినగానే ఒప్పుకొము కదా. మనమంతా ఒప్పుకున్నప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చింది. మలయాళంలో కూడా చాలా మంది ఇప్పటికి గుర్తుపడతారు. పెద్ద ప్రాజెక్ట్ అని చేయలేదు. పాత్ర చేసినప్పుడు విలువలు అవసరం. ఎక్కడా కూడా మీటర్స్ పెట్టుకోకూడదు. కథ బావుంటే చాలు.

తోలు బొమ్మలాట ఎలా ఉండబోతోంది?

ఫ్యామిలీ డ్రామాలో చాలా రకాల సినిమాలు వచ్చాయి. ఒక ఫ్యామిలిలో అందరూ ఒకే చోట కలవడానికి వస్తారు. ఎవరు చూపించని యూనిక్ పాయింట్ ని ఈ సినిమాలో చూపించడానికి ప్రయత్నించాం.కొన్ని రోజులు జరిగే జర్నీలో మనుషులు ఏ విధంగా మారిపోతారు? అనే కాన్సెప్ట్ నుంచి చిన్న చిన్న పాయింట్స్ ని సినిమాలో హైలెట్ గా చూపించాం. గొప్పదిరా మనిషి పుట్టుక అనే సాంగ్ రిలీజ్ చేశాం. అప్పుడే సినిమా భావం అందరికి అర్థమై ఉంటుంది. ఎప్పటికైనా అందరూ వెళ్లిపోవాల్సిందే.. మధ్యలో జరిగే నాటకమే జీవితం అనే లైన్ లో సినిమా నడుస్తుంది. సినిమాలో ఒక మంచి ఎమోషన్ ఉంటుంది. ఒక బావ మరదలి మధ్య ప్రేమ.. వారిద్దరికీ పెళ్లి చేయాలనే కోరుకునే తాత.. ఇలా సాగుతున్న క్రమంలో సినిమాలో మంచి ట్విస్ట్ ఉంటుంది.

రాజేంద్రప్రసాద్ గారితో నటించడం ఎలా ఉంది?

సీనియర్స్ తో ఉన్నప్పుడు కొంచెం మొహమాటం భయం ఉంటుంది. కానీ వారి నుంచి అలాంటి ఫీల్ ని రానివ్వలేదు. చాలా సరదాగా ఉంటారు. ఆయన వచ్చి ముందే పలకరించడంతో చాలా ఫ్రీ అయిపోతాం. ఆయనతో నటించడం చాలా హ్యాపీగా అనిపించింది. కాకపోతే ఆయనతో కామెడీ చేయడం చాలా కష్టం. టైమింగ్ పట్టుకోవడం కష్టమే. సీన్ సరిగ్గా చేయకపోతే నాకు చివాట్లు ఏమి పడలేవు గాని. హీరోయిన్ హర్షిత గట్టిగా తినేసింది. నాకు ఆయనతో నటించడం ఇబ్బందిగా ఏమి అనిపించలేదు.

తోలు బొమ్మలాట ఎవరు ఆడిస్తారు?

వెన్నెల కిషోర్ - రాజేంద్రప్రసాద్ ..ఆ తరువాత మేము.. ఇలా ప్రతి ఒక్కరు సందర్భాన్ని బట్టి ఆడిస్తారు. ఒకరినొకరు ప్రేరణ పొందే అంశాలు చాలా ఉంటాయి. సినిమాలో డైలాగ్స్ కావాల్సిన స్పెన్ లో అద్భుతంగా వచ్చాయి. మిగతా టైమ్ లో నార్మల్ గా ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నట్లు ఉంటాయి. మ్యూజిక్ కూడా సినిమాకు మంచి బూస్ట్ ఇస్తుంది. ఒక సీన్ లో నేను ఎంత ఎడిపిస్తున్నా.. ఆడియెన్స్ ఆ ఫీల్ కలగాలి అంటే మ్యూజిక్ పనితనం కనిపించాలి. 13 నిమిషాల క్లయిమ్యాక్స్ లో అది హై లెవెల్లో కనిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సురేష్ అద్భుతంగా ఇచ్చాడు. సినిమా ప్రివ్యూ చూసి కొంతమంది సన్నిహితులు ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు. ఫ్యామిలీ ఆడియెన్స్ కి ఈ సినిమా ఎక్కువగా ఆకట్టుకుంటుంది. దర్శకుడు విశ్వనాథ్ కి మొదటి సినిమా అయినప్పటికీ చాలా చక్కగా డీల్ చేశాడు. సీనియర్ డైరెక్టర్స్ తో చాలా బాగా వర్క్ చేయించుకున్నాడు. ఎమోషనల్ అనేది యూనివర్సల్ పాయింట్ అందుకే ఈ కథ ఎంచుకున్నాడు. తోలు బొమ్మలాట లో మన బంధువులు ఉన్నట్లు ఒక ఫీల్ కలుగుతుంది.

నిర్మాత గురించి చెప్పాలంటే..

దుర్గా ప్రసాద్ గారు యూఎస్ లో ఉంటారు. ఆయాన్ డాక్టర్. సినిమా చేసుకొమ్మని డబ్బులు ఇచ్చారు. సినిమా చేస్తున్నంత సేపు కనపడలేదు. ఫస్ట్ కాపీ చూశాక అందరికంటే ఎక్కువగా ఆయనకు సినిమాపై చాలా కాన్ఫిడెన్స్ పెరిగింది. సినిమా చాలా బావుందని చెప్పి.. క్లయిమ్యాక్స్ చూసినప్పుడు చిన్నపిల్లాడిలా ఎమోషన్ అయ్యారు. ఓ విదంగా మా అందరికి ఆయనే మంచి బూస్ట్ ఇచ్చారు.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి..

ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నాను. ఈ సినిమా తరువాత భవ్య క్రియేషన్స్ లో ఒక సినిమా వస్తుంది. డిసెంబర్ ఎండ్ కి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాం. అదొక బ్యూటీఫుల్ థ్రిల్లర్ కాన్సెప్ట్. ఆ సినిమాలో సోలో హీరోగానే కనిపిస్తున్నా. పోస్టర్ కూడా త్వరలోనే రిలీజ్ చేస్తాం. ఆ సినిమాలో నన్ను చాలా కొత్తగా చూస్తారు. 'కాదల్' అనే మరో సినిమా చేస్తున్నా. ఆ తరువాత
కాకినాడ కుర్రోడు అనే డిఫరెంట్ సినిమాతో వస్తాను. నెక్స్ట్ నా నుంచి మంచి మంచి సినిమాలు రాబోతున్నాయి. ఇక తోలుబొమ్మలాట ఈ నెల 22న రిలీజ్ కాబోతోంది. తప్పకుండా ఈ సినిమా అందరికి నచ్చుతుంది అని భావిస్తున్నా..