దత్తత గ్రామం చెరుపల్లిని నగదు రహితం చేయనున్న హీరో..!
- IndiaGlitz, [Tuesday,January 10 2017]
భద్రాచలం సమీపంలోని చెరుపల్లి గ్రామాన్ని దత్తత తీసుకుని ప్రతి సంవత్సరం కొన్ని కార్యక్రమాలను చేపట్టడం ద్వారా పది ఏళ్లలో గ్రామ స్వరాజ్య దిశగా చెరుపల్లి గ్రామాన్ని నిలిపేలా హీరో ఆదిత్య ఓం కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో గత ఏడాది లైబ్రరీని, క్రీడా సామాగ్రిని అందించిన తాను ఈ ఏడాది చెరుపల్లి గ్రామాన్ని నగదు రహితం చేసేందుకై టీ సేవా కేంద్రంతో కలిసి పని చేయనున్నట్టు తెలిపారు.
నిర్మాత విజయ్ వర్మ పాకలపాటి సొంత గ్రామమైన చెరుపల్లిని ఆయన ప్రొద్భలంతో దత్తత తీసుకుని తన వంతుగా కొన్ని కార్యక్రమాలను చేపడుతున్నాను అని దీనిలో భాగంగానే నేడు నెలకొన్ని ఉన్న పరిస్థితుల్లో గ్రామ స్ధాయిలో కూడా ఆన్ లైన్ సేవా కేంద్రం అవసరమని భావించి టి సేవా కేంద్రం డైరెక్టర్ ఎ.వెంకటరెడ్డి గారిని చెరువల్లి గ్రామానికి ఫ్రాంఛైజీ ఇవ్వమని కోరగానే ఆయన అంగీకరించడం జరిగింది అన్నారు. ఈ నేపధ్యంలో అందుకు అవసరమైన ల్యాప్ టాప్ ని ఆనందం ఫౌండేషన్ నిర్వాహకులు నిర్మాత విజయ్ వర్మ పాకలపాటికి అందచేసానని అన్నారు.
ఈ గ్రామంలో నెట్ వర్క్ ప్రాబ్లం ఉందని కాబట్టి కాస్త బెటర్ గా ఉన్న మొబైల్ కంపెనీలతో మాట్లాడి రూటర్ ను ఏర్పాటు చేసి జనవరి నెలాఖరులోగా ఈ టీ సేవా కేంద్రాన్ని ప్రారంభించనున్నాను అని తెలిపారు. కంప్యూటర్ కోర్స్ లు నేర్చుకునేందుకు కూడా ఈ కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని తన ఆధ్వర్యంలో నడుస్తున్న ఎడ్యులైట్ మెంట్ ఫౌండేషన్ ద్వారా భవిష్యత్ లో చెరుపల్లిలో మరియు చుట్టు ప్రక్కల గ్రామాల్లో మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నాం అని సంక్రాంతికి జరిగే క్రీడా పోటీలకు కూడా నా వంతు సహకారాన్ని అందిస్తున్నాను అని ఆదిత్య ఓం తెలిపారు.