Hero Flood: వరద నీటిలో ఇరుక్కుపోయిన హీరో.. సాయం కోసం ఎదురుచూపులు..
Send us your feedback to audioarticles@vaarta.com
మిజాంగ్ తుఫాన్ కారణంగా తమిళనాడు అతలాకుతలమైంది. ముఖ్యంగా చెన్నై నగరం చిగురుటాకులా వణికపోయింది. భారీ వర్షాలకు రోడ్లపైకి నీరు భారీగా చేరి చెరువులను తలపిస్తున్నాయి. కొన్ని చోట్ల కార్లు కూడా కొట్టుకుపోయాయి. ఇక లోతట్టు ప్రాంతాలు అయితే నీటితో నిండిపోయి ప్రజలు బయటకు కూడా రాలేని పరిస్థితి నెలకొంది. ఇళ్లలోకి పాములు, ఇతర విషప్రాణులు వస్తుండటంతో జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. నగరంలోని పెరుగంళత్తూర్ ప్రాంతంలో ఓ మొసలి రోడ్డు దాటుతూ కనిపించింది. దీంతో చెన్నై వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
మరోవైపు చాలా ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకొరగడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. భారీ వరద నీటితో చాలా మంది ప్రజలు నీటిలో చిక్కుకుపోయారు. దీంతో NDRF, SDRF బలగాలు సహాయక చర్యలు చేపట్టాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏదైనా సమస్య తలెత్తితో టోల్‌ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేయాలని చెబుతున్నారు. ఇదిలా ఉంటే నటుడు విష్ణు విశాల్ వరద నీటిలో చిక్కుకున్నట్లు ట్వీట్ చేశాడు. కారప్పాకంలోని తమ ఇంట్లో వరద నీరు రావడంతో ఇంటి పైకి ఎక్కానని తెలిపాడు. విద్యుత్, ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులో లేదని.. సాయం కోసం ఎదురుచూస్తున్నానని ఇంటి పైకి రావడంతో కొద్దిగా సిగ్నల్ అందగానే ఈ పోస్ట్ చేస్తున్నానని పేర్కొన్నాడు.
ఇక హీరో విశాల్ కూడా చెన్నైలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల గురించి నగర మేయర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు."డియర్ ప్రియా రాజన్ (చెన్నై మేయర్), గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ కమిషనర్, ఇతర అధికారులకు.. మీ నివాసాల్లోకి వరద నీరు రావడం లేదని అనుకుంటున్నా. మీ కుటుంబ సభ్యులతో కలిసి ఇళ్లలో సురక్షితంగా ఉన్నారని భావిస్తున్నా. మీ ఇళ్లకు కరెంట్, ఆహారం ఎలాంటి లోటు లేకుండా అందుతోందని భావిస్తున్నా. అయితే సిటీలో మీతో పాటు నివసిస్తున్న ఇతర ప్రజలు మాత్రం మీ మాదిరి సురక్షితంగా లేరు. మీరు చేపట్టిన స్టార్మ్ వాటర్ డ్రెయిన్ ప్రాజెక్ట్ సింగపూర్ కోసమా లేక చెన్నై కోసమా?"అని ప్రశ్నించారు.
"2015లో భారీ వర్షాల కారణంగా సంభవించిన విపత్తు సమయంలో అందరం రోడ్ల మీదకు వచ్చి ప్రజలకు సాయం అందించాం. అది జరిగిన 8 ఏళ్ల తర్వాత పరిస్థితి మరింత ఘోరంగా తయారయింది. ఈ సారి కూడా బాధితులకు మేమంతా ఆహారం, నీటిని పంపిణీ చేసి వారిని ఆదుకుంటాం. ఈసారి ప్రజా ప్రతినిధులంతా వారివారి నియోజకవర్గాల్లో బయటకు వచ్చి బాధితులకు అండగా నిలుస్తారని ఆశిస్తున్నా. బాధిత ప్రజల్లో భయం, ఆందోళనను కాకుండా విశ్వాసాన్ని నింపాలని కోరుకుంటున్నా" అని ట్వీట్ చేశారు. అటు కొంతమంది సెలబ్రెటీలు ప్రజలను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. ఇప్పటికే సూర్య బ్రదర్స్ చెరో రూ.10లక్షలను సీఎం సహాయనిధికి విరాళం ప్రకటించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout