Actor Satya: టాలీవుడ్‌లో విషాదం.. గుండెపోటుతో ప్రముఖ హీరో కన్నుమూత

  • IndiaGlitz, [Friday,June 03 2022]

ఇటీవలి కాలంలో తెలుగు సినీ పరిశ్రమలో వరుసగా విషాదకర సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. నెలల వ్యవధిలోనే చాలా మంది నటీనటులు, టెక్నీషియన్లు, దర్శకులు, నిర్మాతలు మరణించారు. ఇక, గత వారం రోజుల్లో దేశంలోనే ఫేమస్ అయిన ఇద్దరు సింగర్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. వరుస సంఘటనలతో అభిమానులు , చిత్ర పరిశ్రమ తీవ్ర విషాదంలో కూరుకుపోయింది. ఈ క్రమంలో తాజాగా టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. హీరో సత్య కన్నుమూశారు. గురువారం సాయంత్రం గుండెపోటుకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే సత్య అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు గుర్తించారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు అధికారికంగా మీడియాకు వెల్లడించారు.

2004లో వచ్చిన 'వరం' అనే మూవీ ద్వారా హీరోగా పరిచయం అయిన సత్య.. ఆ తర్వాత 'బ్యాచ్‌లర్స్' అనే సినిమాలోనూ నటించారు. అయితే, ఈ సినిమాలు అనుకున్నంత స్థాయిలో విజయం సాధించకపోవడంతో ఆయనకు గుర్తింపు దక్కలేదు. దీంతో కొన్నేళ్లుగా పరిశ్రమకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే సత్య కొన్ని వ్యాపారాలను ప్రారంభించి వాటిని చూసుకుంటున్నారు. అలాగే, పదేళ్ల క్రితమే వివాహం చేసుకున్నారు. జీవితం సాఫీగా సాగిపోతోంది అనుకుంటోన్న సమయంలోనే గతేడాది కరోనా సెకెండ్ వేవ్ సమయంలో తన భార్యను, తల్లిని సత్య నాలుగు రోజుల వ్యవధిలోనే కోల్పోయారు. అప్పటి నుంచి ఆయన మానసిక క్షోభకు లోనవుతున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సత్యకు ఎనిమిదేళ్ల వయసున్న కుమార్తె రిత్విక ఉంది. సత్య అంత్యక్రియలను హైదరాబాద్‌లోని ఈఎస్ఐ స్మశాశన వాటికలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.