Naga Shaurya: నువ్వయ్యా నిజమైన హీరో : లవర్ అయితే ఆడపిల్లను కొడతావా, సారీ చెప్పు .. గొడవకు దిగిన నాగశౌర్య
- IndiaGlitz, [Wednesday,March 01 2023]
సినిమాల్లో ఎవరైనా తమ కళ్లెదుట ఆడపిల్లను కొట్టినా, వాళ్లను హింసించినా హీరోగారు వెళ్లి వారిని చితక్కొట్టి వస్తాడు. ఈ సీన్ చూసి థియేటర్లో ప్రేక్షకులు ఈలలు, చప్పట్లు కొడుతూ వుంటారు. అయితే రియల్ లైఫ్‌లో ఇలాంటి సంఘటనలు అరుదు. మనకెందుకులే అని పక్క నుంచి వెళ్లిపోతారు తప్పించి.. వారిని ఆపే ప్రయత్నం ఏ ఒక్కరు చేయరు. అయితే యువ కథానాయకుడు తాను రీల్ లోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ హీరోనేనని నిరూపించుకున్నారు. ఒక అమ్మాయిని నడిరోడ్డుపై కొడుతున్న వ్యక్తిని అడ్డుకుని క్లాస్ పీకి అందరి హృదయాలను గెలుచుకున్నారు.
అసలేం జరిగిందంటే :
తన కారులో ఏదో పని మీద వెళ్తుండగా నాగశౌర్యకు.. రోడ్డు మీద ఇద్దరు యువతీ, యువకులు గొడవ పడుతున్నారు. ఇదే సమయంలో అబ్బాయి అమ్మాయిపై చేయి చేసుకున్నాడు. అది గమనించిన నాగశౌర్య క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే కారు దిగి వచ్చేశారు. చోద్యం చూస్తున్న జనాలను పక్కకు నెట్టేసి ఆ అబ్బాయిని పట్టుకుని అమ్మాయికి క్షమాపణలు చెప్పాలంటూ నిలదీశాడు. దానికి ఆ అబ్బాయి తాను ఆ అమ్మాయి లవర్‌నని చెప్పాడు. దానికి నాగశౌర్య.. లవర్ అయితే ఆడపిల్లను నడిరోడ్డుపై కొడతావా అంటూ గద్దించారు. తక్షణం క్షమాపణలు చెప్పాలని నాగశౌర్య పట్టుబట్టారు. దీనికి మిగిలిన జనం కూడా జత కలవడంతో ఆ అబ్బాయి దిగొచ్చినట్లే తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా మీరు రియల్ లైఫ్ హీరో అంటూ నాగశౌర్యను మెచ్చుకుంటున్నారు. స్టార్ స్టేటస్ వున్నప్పటికీ.. తనకెందుకులే అని వెళ్లిపోకుండా సదరు యువకుడిని నిలదీసి గొడవ పడ్డందుకు మీరు గ్రేట్ అంటూ వారు ప్రశంసిస్తున్నారు.
ప్రస్తుతం శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో నటిస్తోన్న నాగశౌర్య:
ఇక సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల ఓ ఇంటివాడైన నాగశౌర్య మ్యారేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో ‘‘ఫలానా అబ్బాయి .. ఫలానా అమ్మాయి’’ సినిమా చేస్తున్నారు నాగశౌర్య. ఇందులో ఆయన సరసన మాళవికా నాయర్ హీరోయిన్గా నటిస్తున్నారు.
Matter endi pic.twitter.com/IldGEqdxvr
— UnqBoi 🍥 (@UnqBoi007) February 28, 2023