ఘనంగా “ఆర్ఎక్స్100” హీరో కార్తీకేయ వివాహం.. హాజరైన మెగాస్టార్ చిరంజీవి

  • IndiaGlitz, [Sunday,November 21 2021]

యువ హీరో, ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ కార్తికేయ ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రియురాలు లోహిత మెడలో మూడుముళ్లు వేశాడు. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని ఓ కళ్యాణ వేదికలో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్‌ చిరంజీవి, అల్లు అరవింద్‌, తణికెళ్ల భరణి, అజయ్‌ భూపతి, పాయల్‌ రాజ్‌పుత్‌తోపాటు పలువురు సినీ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

వరంగల్ నీట్‌లో బీటెక్‌ చదువుతున్న రోజుల్లోనే కార్తికేయకు లోహితతో పరిచయం ఏర్పడి అది ప్రేమకు దారి తీసింది. చదువు తర్వాత హీరోగా రాణించాలనే ఉద్దేశంతో కార్తికేయ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. అలా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్‌ఎక్స్‌ 100’తో తొలి ప్రయత్నంలోనే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. యువతలో మంచి క్రేజ్ తెచ్చుకుని ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తున్నారు. ఇటీవల ఆయన నటించిన ‘రాజా విక్రమార్క’ విడుదలైంది. ఇక తమిళ అగ్ర కథానాయకుడు అజిత్‌ హీరోగా నటించిన ‘వలిమై’ చిత్రంలో కార్తికేయ కీ రోల్‌ పోషించారు.

ఇక రాజా విక్రమార్క ప్రీ రిలీజ్ వేడుక సందర్భంగా త‌న‌కు కాబోయే భార్య‌ని ప‌రిచ‌యం చేసి ఆశ్చర్యపరిచాడు . ‘నా జీవితంలో హీరో కావడానికి ఎంత కష్టపడ్డానో అంత కష్టపడి ఓ అమ్మాయిని ప్రేమించి ఒప్పించుకున్నా. అప్పుడే తనకి నేను హీరో అవుదామని అనుకుంటున్నానని చెప్పి, హీరో అయ్యాక మీ ఇంట్లో వచ్చి అడుగుతా’నని చెప్పా. నేను హీరో అయ్యి… చివరికి ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటున్నా’’ అని అభిమానులకు చెప్పాడు.