కోట్లు కొల్లగొడుతున్న 'ఇస్మార్ట్ శంకర్' కాన్సెప్ట్ నాదే! - రైటర్ కమ్ హీరో ఆకాష్
- IndiaGlitz, [Monday,July 22 2019]
కాన్సెప్ట్ పరంగా చాలా కొత్తగా ఉండి.. కొత్తతరం ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండడంతో కోట్లు కొల్లగొడుతున్న 'ఇస్మార్ట్ శంకర్' మెయిన్ కాన్సెప్ట్ తనదే అంటున్నారు అందాల కథానాయకుడు, 'ఆనందం' ఫేమ్ ఆకాష్. ఒక వ్యక్తి మెదడును హీరోకి మార్పిడి చేయడమనే మూల కథతో 'ఇస్మార్ట్ శంకర్' రూపొందింది.
ఇదే ఇతివృత్తంతో తెలుగు-తమిళ భాషల్లో తను తయారు చేసిన కథ, కథనాలతో తననే హీరోగా పెట్టి రాధ అనే మహిళా దర్శకురాలు ఒక సినిమా తీశారని, ఆ సినిమా తమిళంలో ఇప్పటికే 'నాన్ యార్' పేరుతొ విడుదల కాగా, తెలుగులో 'కొత్తగా ఉన్నాడు' టైటిల్ తో త్వరలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్న తమకు 'ఇస్మార్ట్ శంకర్' రూపంలో షాక్ తగిలిందని ఆకాష్ పేర్కొన్నారు.
ఈ విషయమై పూరి జగన్నాధ్ ను సంప్రదించాలని ప్రయత్నించామని.. కానీ ఆయన అందుబాటులోకి రాకపోవడం వలన.. తమిళ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో ఫిర్యాదు చేసి.. సత్వర పరిష్కారం కోసం ఇక్కడ మీడియాను ఆశ్రయించామని ఆకాష్ తెలిపారు. తన వాదనను వినిపించే ఆధారాలను ఆకాష్ మీడియా ముందు ఉంచారు. సమస్య సామరస్యంగా పరిష్కారం కానీ పక్షంలో లీగల్ గా ప్రొసీడ్ అయ్యేందుకు కూడా తానూ సిద్ధపడుతున్నట్లు ఆయన ప్రకటించారు!!