హైదరాబాద్ జూలోని 8 సింహాలకూ కరోనా.. అసలెలా సోకిందంటే..

  • IndiaGlitz, [Wednesday,May 05 2021]

కరోనా సెకండ్ వేవ్ ఊహించని రీతిలో ప్రళయం సృష్టిస్తోంది. మనుషులకే కాదు.. జంతువులకు సైతం వ్యాపించి షాకిస్తోంది. తాజాగా హైదరాబాద్ నెహ్రూ జులాజికల్ పార్కులో 8 ఆసియా సింహాలకు కరోనా సోకింది. ఇలా జరగడం దేశంలోనే తొలిసారి కావడం గమనార్హం. హైదరాబాద్‌ నెహ్రూ జంతు ప్రదర్శనశాలలోని ఎనిమిది ఆసియా సింహాలకు కరోనా సోకింది. జంతువులకు కరోనా సోకడం దేశంలో ఇదే తొలిసారి. ఏప్రిల్ 24న జూలోని 8 సింహాలకు తేలికపాటి శ్వాసకోశ సమస్యలతో బాధపడుతుండటాన్ని సిబ్బంది గమనించారు. సింహాల ముక్కు నుంచి ద్రవంలా కారడం గమనించారు. వెంటనే పరీక్ష చేయించాలని నిర్ణయించారు.

Also Read: మమతా మోహన్‌దాస్ బోల్డ్ ఫోటోషూట్.. నెటిజన్లు ఫిదా..

సెంట్రల్ జూ అథారిటీ మార్గదర్శకాల మేరకు సింహాల ముక్కు, నోటి నుంచి నమూనాలను సేకరించి సీసీఎంబీకి పరీక్షల నిమిత్తం పంపించారు. పరీక్షల్లో ఎనిమిది సింహాలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కరోనా సోకిన వాటిలో నాలుగు ఆడ, నాలుగు మగ సింహాలు ఉన్నాయి. జూ పార్క్‌లో మొత్తం 11 ఆసియా సింహాలుండటంతో.. కరోనా సోకిన సింహాలను వేర్వేరు ఎన్‌క్లోజర్స్‌లో ఐసోలేషన్‌ చేశారు. జూలోని సింహాలకు వాటిని సంరక్షించే సిబ్బంది ద్వారా కరోనా సోకి ఉంటుందని సీసీఎంబీ సలహాదారు డాక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు.

అసలెలా సోకిందంటే..

అయితే ఇటీవల జూ సిబ్బందిలో దాదాపు 30 మందికిపైగా కరోనా సోకింది. వీరిలో సింహాల కేర్‌ టేకర్లూ ఉన్నారని.. వారి ద్వారానే సింహాలకు కరోనా వచ్చిందని అటవీ అధికారులు సైతం భావిస్తున్నారు. జంతువుల్లో కోవిడ్ వ్యాప్తి అనేది అనూహ్య పరిణామమేనని రాకేశ్ మిశ్రా తెలిపారు. అయితే వాటికి స్వల్ప కరోనా లక్షణాలు మాత్రమే ఉన్నాయని.. చికిత్సకు స్పందిస్తున్నాయని.. ఆహారం తీసుకుంటూ కోలుకుంటున్నాయని జంతు ప్రదర్శనశాల డైరెక్టర్ డాక్టర్ కుక్రెట్టి తెలిపారు. జూలోని ఇతర జంతువుల నుంచి వాటిని వేరుగా ఉంచి తగిన సంరక్షణ, అవసరమైన చికిత్సను అందిస్తున్నట్టు తెలిపారు.