'మా' ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా హేమ పోటీ...
- IndiaGlitz, [Friday,March 08 2019]
‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికలు ఈ నెల 10న జరగనున్నాయి. మా అధ్యక్షుడు శివాజీ రాజా పదవీకాలం ముగియడంతో జరుగుతున్న ఈ ఎన్నికలు అటు నరేశ్.. ఇటు రెండోసారి శివాజీ రాజా పోటీ చేస్తున్నారు. ‘మా’ సభ్యులే తనను మళ్లీ పోటీ చేయమన్నారని కచ్చితంగా ఆదరించి మరో అధ్యక్ష పీఠం కట్టబెడతారని శివాజీ భావిస్తుండగా.. ఆయన హయాంలో జరిగిందేమీ లేదని.. అందుకే స్నేహితుడైనప్పుటికీ తాను బరిలోకి దిగానని సీనియర్ నటుడు నరేశ్ చెబుతున్నారు. ఇదిలా ఉంటే ‘మా’ ఎన్నికల బరిలో స్వతంత్ర అభ్యర్థులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తానికి చూస్తే.. సార్వత్రిక ఎన్నికలు కన్నా రంజుగా ‘మా’ ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో.
నేను గెలుస్తా..!
ఇవన్నీ అటుంచితే.. శివాజీ రాజా ప్యానెల్‌లో వైస్ ప్రెసిడెంట్స్‌గా ఎస్వీ కృష్ణారెడ్డి, బెనర్జీ.. నరేశ్ ప్యానెల్‌లో వైస్ ప్రెసిడెంట్‌గా నటుడు రాజశేఖర్, జనరల్ సెక్రటరీగా జీవిత పోటీ చేస్తున్నారు. అయితే సీనియర్ నటి హేమ కూడా స్వతంత్ర అభ్యర్థిగా వైస్ ప్రెసిడెంట్‌గా పోటీ చేస్తున్నాని ప్రకటించారు. తనకున్న పరిచియాలతో హేమ ఈజీగానే గెలుస్తారని ఇండస్ట్రీలోని ఓ వర్గం భావిస్తోంది. ప్యానెల్ తరుపున అయితే ఓ వర్గానికి కొమ్ముకాస్తున్నారనే కామెంట్స్ వస్తుండటంతో కచ్చితంగా తనవైపే సభ్యులు మొగ్గుచూపుతారని.. ముఖ్యంగా పెద్దల కుటుంబాలు తనకే మద్దతు తెలుపుతారని హేమ బరిలోకి దిగారని తెలుస్తోంది. కచ్చితంగా నేనే గెలుస్తాను.. సిని‘మా’ పెద్దలు తనకే ఓటేసి గెలిపిస్తారని హేమ తన సన్నిహితుల వద్ద ధీమా వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఈసారైనా..!?
మరీ ముఖ్యంగా సినిమా కార్మికులు మంచి పనులు చేయాలనే ఉద్దేశం ఉన్న హేమ.. తప్పకుండా విజయం సాధిస్తుందని చాలామంది చర్చించుకుంటున్నారట. ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రచారం.. పెద్దలను కలిసే పనిలో బిజీబిజీగా ఉన్న ఆమె.. ఉమెన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ తనను ఎన్నికల్లో ఆశీర్వదించాలని కొన్ని పోస్టర్లు సైతం ఆమె విడుదల చేశారు. ఇదిలా ఉంటే సార్వత్రిక ఎన్నికల్లో గెలవలేకపోయిన హేమ.. ‘మా’ ఎన్నికల్లో అయినా నెగ్గుతారేమో వేచి చూడాల్సిందే మరి. మార్చి 10న అటు నరేశ్, శివాజీ రాజాతో పాటు హేమ భవితవ్యం కూడా తేలనుందన్న మాట.