Download App

Hello Review

అక్కినేని అభిమానులు ఆస‌క్తిగా అక్కినేని అఖిల్ సినీ రంగ ప్ర‌వేశం కోసం వెయిట్ చేశారు. అయితే అఖిల్ తొలి సినిమా పెద్ద స‌క్సెస్ కాక‌పోవ‌డంతో నాగ్ అండ్ అక్కినేని ఫ్యామిలీ స‌హా అంద‌రూ కాస్త అఖిల్ రీ లాంచ్‌ను పెద్ద‌గానే ప్లాన్ చేశారు. ముఖ్యంగా అక్కినేని నాగార్జున రంగంలోకి దిగి..అన్నీ విష‌యాలు ద‌గ్గ‌రుండి చూసుకున్నారు. దాదాపు రెండేళ్ల త‌ర్వాత అఖిల్ త‌న రెండో సినిమా హ‌లోతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్లు ప్ర‌టించారు. అక్కినేని ఫ్యామిలీకి క‌లిసొచ్చిన ల‌వ్ స్టోరీతో  పాటు యాక్ష‌న్ మిళితం చేసిన తెరకెక్కించిన సినిమా ఇది. సినిమాకు బాబ్ బ్రౌన్ అనే హాలీవుడ్ యాక్ష‌న్ మాస్ట‌ర్‌తో పాటు అక్కినేని ఫ్యామిలీకి మ‌నం వంటి సూప‌ర్ హిట్ సినిమాను ఇచ్చిన విక్ర‌మ్ కుమార్‌తో పాటు ఆ సినిమాకు పనిచేసిన యూనిట్ అంతా రంగంలోకి దిగింది. సినిమా ఫస్ట్ లుక్‌, టీజ‌ర్‌, ట్రైల‌ర్ ఇలా అన్నింటా ఓ స‌క్సెస్‌ఫుల్ టీమ్ త‌మ‌దైన మార్కును చూపించ‌డంతో..సినిమాపై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. మ‌రి ఈ అంచ‌నాల‌తో అఖిల్ స‌క్సెస్ అందుకున్నాడా?  లేదా అని తెలియాలంటే క‌థేంటో చూద్దాం...

క‌థ‌:

ఏక్ తార్‌తో చిన్న చిన్న పాట‌ల‌ను ప్లేచేసే అనాథ పిల్ల‌వాడు శీను(అఖిల్‌)కి జున్ను(క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌) ప‌రిచ‌యం అవుతుంది. జున్ను అస‌లు పేరు ప్రియ‌. కానీ జున్ను ఎప్పుడూ శీనుకి త‌న అస‌లు పేరు చెప్ప‌డు. ఇద్ద‌రి చిన్న‌పిల్ల‌ల మ‌ధ్య మంచి స్నేహం కుదురుతుంది. జున్ను కోసం శ్రీను స్వంత ట్యూన్‌ను ఏక్‌తార్‌పై ఎలా ప్లే చేయాలో కూడా నేర్చుకుంటాడు. వీరి స్నేహం చ‌క్క‌గా సాగుతున్న క్ర‌మంలో.. జున్ను నాన్న‌కి ఢిల్లీకి ట్రాన్స్‌ఫ‌ర్ అవుతుంది. అక్క‌డి వెళ్లిపోయే క్ర‌మంలో వంద రూపాయ‌ల నోటుపై జున్ను త‌న మొబైల్ నెంబ‌ర్ రాసి శీనుకి ఇస్తుంది. కానీ శీను, ఓ కార‌ణంగా ఆ వంద నోటును పొగొట్టుకుంటాడు. చిన్న యాక్సిడెంట్‌లో..ప్ర‌కాష్‌(జ‌గ‌ప‌తిబాబు), స‌రోజిని(ర‌మ్య‌కృష్ణ‌)ల వ‌ద్ద‌కు చేరుతాడు శీను. పిల్ల‌లు లేని వీరిద్ద‌రూ శీనుకి అవినాష్ అనే పేరు పెట్టుకుని పెంచి పెద్ద చేస్తారు. అవినాష్..ఎంత పెరిగే కొద్ది జున్నుపై ప్రేమ పెరుగుతుందే కానీ త‌గ్గ‌దు. ప్ర‌తిరోజు అవినాష్ ..జున్నుని క‌లిసి రామ‌కృష్ణ జంక్ష‌న్ వ‌ద్ద‌కు వెళుంటాడు. ఓ రోజు క్యాబ్ డ్రైవ‌ర్ నుండి ఓ రాంగ్ కాల్ వ‌స్తుంది. హైద‌రాబాద్‌లో మ్యూజిక్ ఫెస్టివ‌ల్ ద‌గ్గ‌ర ఉన్న క్యాబ్ డ్రైవ‌ర్‌కు ద‌గ్గ‌ర‌లో ఎవ‌రో అమ్మాయి ఓ ట్యూన్ ప్లే చేయ‌డంతో..మొబైల్‌లోనే ఆ సౌండ్‌ను వింటాడు అవినాష్‌. అయితే అది చిన్న‌ప్పుడు త‌ను జున్ను కోసం నేర్చుకున్న ట్యూన్ అని తెలుసుకుంటాడు.  ఆ అమ్మాయి ఎవ‌రో తెలుసుకునే లోపు..అవినాష్ ఫోన్‌ను ఎవ‌రో లాక్కుని పారిపోతారు. దాంతో అవినాష్ ఫోన్ కోసం..అందులో డ్రైవ‌ర్ నంబ‌ర్ కోసం వారిని వెండిస్తాడు. చివ‌ర‌కు మొబైల్స్‌ను చోరీ చేసే ముఠా నుండి త‌న ఫోన్‌ను సంపాదించుకుంటాడు. కానీ అది రిపేర్ అయ్యి ఉంటుంది. దాన్ని రిపేర్‌కిచ్చిన అవినాష్‌కి ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర‌వుతాయి?  జున్నుని అవినాష్ ఎలా క‌లుసుకుంటాడు? అస‌లు ఇద్ద‌రూ క‌లుసుకుంటారా?  లేదా? అని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..

ప్ల‌స్ పాయింట్స్:

అఖిల్‌ తెర‌మీద ఆద్యంతం మెప్పించాడు. అత‌ను డ్యాన్సులు చేసినా, ఫైట్లు చేసినా, ఛేజ్‌లు చేసినా, పాట పాడినా, హీరోయిన్‌ని ప్రేమ‌గా చూసినా, త‌ల్లిదండ్రుల‌తో బాధ్య‌త‌గా ప్ర‌వ‌ర్తించినా అందంగానే క‌నిపించింది. అనూప్ సంగీతం కూడా సినిమాకు ప్ల‌స్ అయింది. హ‌లో అనే పాట ఇప్ప‌టికే జ‌నాల్లోకి రీచ్ అయింది.  నేప‌థ్య సంగీతంపై అనూప్ ఎక్కువ దృష్టి పెట్టాడ‌ని అర్థ‌మ‌వుతోంది. మంచి క‌థ క‌న్నా, దాన్ని అందంగా, హృద్యంగా,  భావోద్వేగాల‌తో చెప్పిన తీరు ఆక‌ట్టుకుంది. ర‌మ్య‌కృష్ణ‌, జ‌గ‌ప‌తిబాబు జంట తెరమీద బావుంది. అఖిల్ ప‌క్క‌న అమ్మాయి ఆనాలంటే త‌ప్ప‌కుండా ఎంతో కొంత అందంగా ఉండాల్సిందే. అఖిల్ ప‌క్క‌న ఫ్రేమ్స్ లో క‌ల్యాణి బావుంది. సెట్స్ కూడా మెప్పిస్తాయి. చెట్టు మీద‌కు ఎక్క‌డానికి జారుడుగా ఉండ‌టం, అక్క‌డ పిల్లాడు ప‌డుకోవ‌డానికి వీలుగా ఓ స్లోప్‌, దాని మీద ఓ వ‌ల‌.. పాట‌ల్లో సెట్టింగ్స్.. వంటివ‌న్నీ రాజీవ‌న్ ప‌నితీరుకు అద్దం ప‌ట్టేవే. నిర్మాత పెట్టిన ఖ‌ర్చును వినోద్ తెర‌మీద మ‌రింత అందంగా, బాధ్య‌త‌గా చూపించే ప్ర‌య‌త్నం చేశారు

మైన‌స్ పాయింట్లు:

`హ‌లో`ని క‌థ‌గా చెప్తే కొత్త‌గా అస‌లు అనిపించ‌దు. ఒక పాట ఇద్ద‌రిని క‌ల‌ప‌డం అనేది తెలుగు ప్రేక్ష‌కుల‌కు కొత్త కాదు. చిన్న‌ప్ప‌టి స్నేహితులు, పెద్ద‌య్యాక కూడా త‌మ మ‌న‌సుల్లో అవ‌త‌లివారినే మోయ‌డం, వారి కోసం ఆరా తీయ‌డం, విధివ‌శాత్తూ వాళ్లు ఎదుటే ఉన్నా గుర్తించ‌లేక‌పోవ‌డం కూడ కొత్త కాదు. కాబ‌ట్టి `హ‌లో` సినిమా క‌థ పరంగా కొత్త‌గా ఉండ‌దు. ట్విస్టులు కూడా పెద్ద‌గా ఏమీ లేవు. స‌న్నివేశాలను చూస్తున్నంత సేపు చాలా సినిమాలు గుర్తొస్తూనే ఉంటాయి.. ఎక్క‌డా విసుగు పుట్టించ‌కుండా సినిమాను ఎడిట్ చేయ‌డంలో ప్ర‌వీణ్‌పూడి కూడా స‌ఫలీకృతుడ‌య్యాడు.

విశ్లేష‌ణ‌:

మ‌హేష్ త‌ర్వాత టాలీవుడ్‌లో అంత‌టి అంద‌గాడు అనే పేరును తొలి సినిమాతోనే తెచ్చుకున్నాడు అఖిల్‌. తొలి సినిమా శాటిస్‌ఫాక్ష‌న్ ఇవ్వ‌క‌పోవ‌డంతో అఖిల్‌తో పాటు తండ్రి నాగార్జున కూడా రెండో సినిమా మీద మ‌రింత శ్ర‌ద్ధ పెట్టారు. త‌మ సంస్థ‌లో `మ‌నం`లాంటి ఫీల్‌గుడ్ మూవీని ఇచ్చిన విక్ర‌మ్‌.కె.కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `హ‌లో` చేశారు. ఈ చిత్రానికి ప‌నిచేసిన టెక్నీషియ‌న్లంద‌రూ త‌మ వంతు ప్రాణం పెట్టి ప‌నిచేశార‌నే విష‌యం అర్థ‌మ‌వుతూనే ఉంది. యాక్ష‌న్ కోసం ఏకంగా బాలీవుడ్ స్టంట్ డైర‌క్ట‌ర్‌ని తీసుకురావ‌డం కూడా ఎంత ఖ‌ర్చుతో కూడిన వ్య‌వ‌హారమో తెలిసిందే. ర‌మ్య‌కృష్ణ‌, జ‌గ‌ప‌తిబాబు తెర‌మీద క‌నిపించినంత సేపు ప్ర‌తి హృద‌యాన్నీ తాకే స‌న్నివేశాలున్నాయి. అలాంటి ఎమోష‌నల్ సీన్ల‌లో అఖిల్ చాలా బాగా న‌టించాడు. రెండో చిత్రానికే అంత సెటిల్డ్ గా చేయ‌డం ప్ర‌శంస‌నీయ‌మే. తెలుగు భాష‌లో ప‌రుషాల‌ను, స‌ర‌ళాల‌ను చ‌క్క‌గా ప‌ల‌క‌గ‌లిగితే అఖిల్ డైలాగ్ డెలివ‌రీ ఇంకా ప‌దునుగా ఉంటుంది. అత‌నికున్న న‌ట‌న‌, డ్యాన్స్, ఫైట్స్ కు ప‌ర్ఫెక్ట్ డైలాగ్ డెలివ‌రీ తోడైతే స్క్రీన్ మీద మ‌రింత శోభ‌గా ఉంటుంది.  ఇక క‌థ విష‌యానికొస్తే ట్రూ కాల‌ర్ల‌లో పేర్లు డిస్‌ప్లే అయిపోతున్న ఈ కాలంలో ఒక్క ఫోన్ నెంబ‌ర్ ప‌ట్టుకోవ‌డం అంత క్లిష్ట‌త‌రం కాదు. పైగా పిల్ల‌ల మ‌న‌సులో ఏముందో అర్థం చేసుకున్న పెద్ద‌ల‌కు కూడా అంత క్లిష్ట‌త‌రం కాదు.  క‌థ‌ను ఓ సారి రీచెక్ చేసుకుని ఉండాల్సిందేమో. మ‌రింత బ‌ల‌మైన స‌న్నివేశాల‌ను రాసుకుని ఉంటే ఇంకా బావుండేదేమో అనేది చాలా మంది మాట‌. ఇలా ప్రేమ పుట్టి అలా మాయం అయిపోతున్న ఈ కాలంలో ఎలాగైనా క‌ల‌వాల‌ని ఆరాట‌ప‌డే రెండు గుండెల చ‌ప్పుడును విన‌గ‌లిగితే ఇలాంటి లాజిక్కులు గుర్తుకురావు.

బాట‌మ్ లైన్: హ‌లో..హృద‌యాల‌ను తాకే ప్రేమ‌క‌థా చిత్రం

Hello Movie Review in English

 

Rating : 3.0 / 5.0