Download App

Hello Guru Prema Kosame Review

రచయిత ప్రసన్నకుమార్ బెజవాడ, దర్శకుడు త్రినాథరావు నక్కిన కాంబినేష‌న్‌లో వ‌చ్చిన‌ 'సినిమా చూపిస్త మావ', 'నేను లోకల్' సినిమాలు గమనిస్తే... కథలో కొత్తదనం ఏమీ కనిపించదు. కానీ, కామెడీతో విజయాలు అందుకున్నారు. ఈసారీ ఏం చేశారు? రామ్ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ప్రసన్నకుమార్ బెజవాడ కథతో దిల్‌రాజు సంస్థ‌ నిర్మించిన సినిమా 'హలో గురు ప్రేమ కోసమే' ఎలా వుంది? ఈ సమీక్ష చదివి తెలుసుకోండి!  

క‌థ‌:

కాకినాడ‌లో పుట్టి పెరిగిన సంజు(రామ్‌) సాఫ్ట్‌వేర్ ట్రెయినీగా ఉద్యోగం చేయ‌డానికి హైద‌రాబాద్ వ‌స్తాడు. త‌న ఫ్యామిలీ ఫ్రెండ్ విశ్వ‌నాథ్‌(ప్ర‌కాశ్ రాజ్‌) ఇంట్లో ఉంటాడు. ఆఫీస్‌లో ప‌నిచేసే రీతు(ప్ర‌ణీత‌) వెన‌క‌బ‌డే సంజు.. అస‌లు త‌ను విశ్వ‌నాథ్ కూత‌రు అనుప‌మ‌( అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌)తో ప్రేమ‌లో ఉన్న‌ట్లు తెలుసుకుంటాడు. అయితే విశ్వ‌నాథ్ త‌న కూతురికి ఎన్నారై కుర్రాడితో పెళ్లి కుదురుస్తాడు. అప్పుడు సంజు ఏం చేస్తాడు? త‌న ప్రేమ‌ను ఎలా గెలిపించుకుంటాడు?  సంజు, విశ్వ‌నాథ్ మ‌ధ్య ఉండే 30 రోజుల ఫ్రెండ్ షిప్ పోటీ ఏంటి? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..

న‌టీన‌టుల ప‌నితీరు:

రామ్ .. ల‌వ్‌స్టోరీస్‌లో ఎక్స్‌ప్రెసివ్‌గానే న‌టిస్తాడు. అది నేను శైల‌జ‌తో ఓ సారి ప్రూవ్ అయ్యింది. ఇప్పుడు అలాంటి పాత్ర‌లో చ‌క్క‌గా న‌వ్విస్తూ మెప్పించాడు రామ్‌. త‌న జోష్‌, కామెడీ టైమింగ్ సినిమాకు మెయిన్ ఎసెట్ అయ్యాయి. ఇక అనుప‌మ పాత్ర‌కు ఫ‌స్టాఫ్‌లో పెద్ద‌గా డైలాగ్స్ లేవు. మా నాన్న అని అంటుండే ఆ పాత్ర సెకండాఫ్‌కి వ‌చ్చేస‌రికి న‌న్ను లేపుకుపో అనడం ఎంత వ‌ర‌కు క‌రెక్టో మ‌రి.. ! ఇక సినిమాలో మ‌రో ప్రధాన‌మైన పాత్ర ప్ర‌కాశ్ రాజ్‌. ఆడ‌పిల్ల తండ్రిగా.. హీరోకు ముప్పై రోజుల వ‌ర‌కు స్నేహితుడిగా న‌టించే పాత్ర‌లో ప్ర‌కాశ్ రాజ్ న‌ట‌న గురించి మ‌నం ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఇక మిగిలిన పాత్ర‌ధారులంద‌రూ వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు.

సాంకేతిక నిపుణుల ప‌నితీరు:

సినిమా చూపిస్త మావ‌, నేను లోక‌ల్ వంటి చిత్రాల్లో మాస్ పాత్ర‌ల్లో అల్లుళ్లు.. మావ‌ల‌తో ఛాలెంజ్ చేసి గెలుస్తుంటారు. కానీ ఈ  సినిమా విష‌యానికి వ‌స్తే.. అదే క‌థ‌ను తండ్రి కూతురి మ‌ధ్య బాండింగ్‌తో ఎమోష‌న‌ల్‌గా మెప్పించే ప్ర‌య‌త్నం చేశారు. రొటీన్ క‌థే.  త్రినాథ‌రావు, ప్ర‌స‌న్న‌, సాయికృష్ణ  కామెడీపై పెట్టిన శ్ర‌ద్ధ ఎమోష‌న్స్‌ను హ‌త్తుకునే క్యారీ చేయ‌డంపై పెట్టుంటే సినిమా ఎఫెక్టివ్‌గా ఉండేద‌నిపించింది. దేవిశ్రీ ప్ర‌సాద్ పాట‌లు అంతంత మాత్రంగానే.. ఉన్నాయి. నేప‌థ్య సంగీతం కూడా అలాగే ఉంది. విజ‌య్ కె.చ‌క్ర‌వ‌ర్తి సినిమాటోగ్ర‌ఫీ బావుంది.

విశ్లేష‌ణ‌:

ప‌రుగు సినిమా క్లైమాక్స్‌లో బ‌న్ని .. నేను మీ స్థానంలో ఆలోచించాను. మీరు నా స్థానంలో ఉండి ఆలోచిస్తే తెలుస్తుంది` అని ప్ర‌కాశ్ రాజ్‌కి చెప్పే డైలాగ్ అంద‌రికీ గుర్తుండే ఉంటుంది క‌దా! అదే కాన్సెప్ట్‌తో రాసుకున్న క‌థ ఇది. ఫ‌స్టాఫ్ అంతా ఫ‌న్నీగా.. సెకండాఫ్ అంతా ఎమోష‌న‌ల్ సీన్స్‌తో క‌థ‌ను న‌డిపించేయాల‌నుకున్నారు. ఈ సినిమాకు నువ్వు నాకు న‌చ్చావ్ చిత్రానికి ద‌గ్గ‌ర పోలిక‌లున్నాయి. ప్ర‌కాశ్ రాజ్‌, చంద్ర‌మోహ‌న్ అందులో మంచి స్నేహితులైతే ఇందులో ప్ర‌కాశ్‌రాజ్‌, సితార‌... అందులో ఆర్తి ఆగ‌ర్వాల్ ప్రేమ‌ను ఎక్స్‌ఫ్రెస్ చేస్తుంది. హీరో వెంక‌టేశ్ తండ్రి కోసం మ‌న‌సులో దాచుకుంటాడు. ఈ చిత్రంలో దానికి రివ‌ర్స్‌గా హీరోయిన్ తన ప్రేమ‌ను మ‌న‌సులో దాచుకుంటుంది. అలాగే ప‌రుగు సినిమాను కూడా గుర్తుకు తెప్పిస్తుంది. ద‌ర్శ‌కుడు త్రినాథ‌రావు గ‌త రెండు చిత్రాల‌ను గ‌మనిస్తే సేఫ్ క‌థ‌ల‌ను ఎంచుకుని కామెడీతో లాంగించేశాడు. అయితే ప్ర‌తిసారి సేఫ్ గేమ్ ఆడాల‌నుకుంటే పొర‌పాటే.

బోట‌మ్ లైన్‌: హ‌లో రొటీనే గురు

Read 'Hello Guru Prema Kosame' Movie Review in English

Rating : 2.5 / 5.0