RajahmundryBridge: ప్రభుత్వం సంచలన నిర్ణయం.. రాజమండ్రి రోడ్ కం రైల్ బ్రిడ్జిపై ఆ వాహనాల ప్రవేశంపై నిషేధం
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రఖ్యాత రాజమండ్రి - కొవ్వూరు రోడ్ కం రైల్ వంతెనపై అధికారులు ఆంక్షలు విధించారు. ఇకపై భారీ వాహనాలకు అనుమతి లేదని జిల్లా కలెక్టర్ డా.కే. మాధవీలత ఆదేశాలు జారీ చేశారు. కేవలం ద్విచక్ర వాహనాలు, కార్లు మినహా ఇతర భారీ వాహనాలకు బ్రిడ్జిపైకి అనుమతి లేదని పేర్కొన్నారు. రోడ్ కం రైల్వే బ్రిడ్జి నిర్మాణం పూర్తయిన తర్వాత 1974 నుంచి వాహనాలు దీని మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి. దీని జీవితకాలాన్ని ఇంజనీర్లు 65 ఏళ్లుగా నిర్ణయించారు. ఇందులో ఇప్పటికే 49 ఏళ్లు పూర్తవుతోంది. దీనికి తోడు రోజురోజుకు ట్రాఫిక్ , వాహన రాకపోకలు పెరుగుతున్నాయి.
భారీ వాహనాల కారణంగా వంతెనకు ప్రమాదం:
రోడ్ కం రైల్వే బ్రిడ్జీపై భారీ వాహనాలు రాకపోకలు పెరుగుతుండటంతో డెక్ జాయింట్‌లు, గడ్డర్లు దెబ్బతింటున్నాయని రోడ్లు, భవనాల శాఖ పరిశీలనలో తేలింది. వంతెన మీదుగా 10.2 టన్నుల బరువుకు మించిన వాహనాలు తిరిగితే వంతెన దెబ్బ తినే అవకాశం వుందని 2007, 2011 సమయంలో నిపుణుల కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ క్రమంలో రోడ్లు భవనాల శాఖ సిఫారసు మేరకు వంతెనపైకి భారీ వాహనాల రాకపోకలను నిషేధించినట్లు జిల్లా కలెక్టర్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ వంతెన మరిన్ని సంవత్సరాల పాటు ప్రజలకు అందుబాటులో వుండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. టూ వీలర్స్, త్రి వీలర్స్, కార్లు తిరిగేలా ట్రాఫిక్ నిబంధనలను అమలు చేస్తామని కలెక్టర్ వెల్లడించారు.
గామన్ బ్రిడ్జిపైనే భారీ వాహనాలకు అనుమతి :
అనుమతించిన వాహనాలు వంతెనపై రాకపోకలు సాగించేందుకు వీలుగా బ్రిడ్జి మధ్యలో పోల్స్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ, జిల్లా రవాణా అధికారి, జిల్లా ప్రజా రవాణా అధికారి (ఆర్టీసీ) తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఇకపై కొవ్వూరు - రాజమహేంద్రవరం మీదుగా ప్రయాణం చేసే భారీ వాహనాలు , బస్సులు జాతీయ రహదారిపై వున్న నాలుగు లైన్ల వంతెన (గామన్ బ్రిడ్జి)పై రాకపోకలు సాగించాలని కలెక్టర్ సూచించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout