పెట్రోల్ బంకులకు ఒక్కసారిగా పోటెత్తిన ప్రజలు.. ఎందుకంటే..?
- IndiaGlitz, [Tuesday,January 02 2024]
కొన్ని రోజులు పాటు పెట్రోల్, డీజిల్ దొరకదా..? ఇప్పుడు ఇదే ప్రశ్న దేశ ప్రజలను భయపెట్టిస్తోంది. అందుకే పలు రాష్ట్రాల్లో పెట్రోల్ బంకులు ముందు వాహనదారులు బారులు తీరారు. కొన్ని చోట్ల కిలోమీటర్ల మేర క్యూ కట్టారు. ఎందుకు అనుకుంటున్నారా..? కేంద్ర ప్రభుత్వం కొత్తగా 'హిట్ అండ్ రన్(Hit and Run)' కేసులకు సంబంధించిన కొత్త చట్టం తీసుకొచ్చింది. భారత న్యాయ సంహిత చట్టంలోని ఈ కొత్త నిబంధన ప్రకారం రోడ్డు ప్రమాదాలకు కారణమైన వాహన డ్రైవర్లు(Truck Drivers) పారిపోతే పదేళ్ల జైలు శిక్ష, రూ.7 లక్షల వరకూ జరిమానా విధించే అవకాశం ఉంది. దీంతో ఈ చట్టంపై ట్రక్కులు, లారీలు, ప్రైవేటు బస్సు డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల కొత్తగా ఇంకెవరూ ఈ వృత్తిలోకి రారని వాపోతున్నారు.
అయితే డ్రైవర్లు, ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్లు ఆందోళనతో ఇంధన ట్రక్కులు, భారీ వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో ఇంధన కొరత(Fuel Shortage) ఏర్పడుతుందో ఏమో అనుమానంతో ప్రజలు పెట్రోల్ బంక్(Petrol Bunks)లకు పోటెత్తారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, జమ్మూకశ్మీర్, లద్దాఖ్ వంటి చోట్ల సోమవారం రాత్రి నుంచి పెట్రోల్ బంక్‌లు కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో పెట్రోల్ బంక్ నిర్వాహకులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఎల్‌పీజీ(LPG) సిలిండర్లు సరఫరాకు ఆటంకం ఏర్పడింది. కొత్త చట్టంలోని నిబంధనలు ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకు ఆందోళనలు విరమించేది లేదని డ్రైవర్లు స్పష్టం చేస్తున్నారు. కొన్ని చోట్ల హైవేలను నిర్బంధించడంతో నిత్యావసర సరుకులు రవాణా కూడా నిలిచిపోయింది. అయితే ఈ నిరసనల నేపథ్యంలో ఇంధన కొరత ఏర్పడకుండా ఉండేందుకు చాలా రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి.