Typhoon effect:తుపాన్ ఎఫెక్ట్.. ఏపీలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు..
Send us your feedback to audioarticles@vaarta.com
మించౌగ్ తుపాన్ ఏపీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ, ఉభయ గోదావరి, బాపట్ల, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈదురుగాలులతో కొన్ని ప్రాంతాల్లో చెట్లు నేలకూలగా.. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో ఎక్కడికక్కడ రాకపోకలు స్తంభించాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఈ నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.
ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు, తిరుపతి జిల్లాలో తుపాన్ ప్రభావం తీవ్రంగా ఉంది. తిరుపతిలో అత్యధికంగా 125 మి.మీ వర్షపాతం నమోదైంది. అటు తిరుమలలోనూ భారీ వర్షం పడటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే చలికి కూడా వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. మరోవైపు నెల్లూరు నగరంలోనూ ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. 13 పునరావాస కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. దాదాపు 250 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించారు.
తుపాన్ ప్రభావం కారణంగా పలు విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఇండిగో సంస్థ ప్రకటించింది. విశాఖపట్నం నుంచి చెన్నై వెళ్లాల్సిన రెండు విమాన సర్వీసులను నిలిపివేసింది. విశాఖ నుంచి హైదరాబాద్ బయలుదేరాల్సిన రెండు సర్వీసులు, ఒక విజయవాడ సర్వీసును రద్దు చేసినట్లు తెలిపింది. అలాగే 142 రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఇప్పటికే తుపాన్ పరిస్థితులపై సీఎం జగన్ ఆరా తీశారు. తుపాను పట్ల అప్రమత్తంగా ఉండాలని తీర గ్రామాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. సహాయక చర్యల్లో ఎలాంటి లోటూ రాకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout