ఇళ్లలో నుంచి బయటికి రావొద్దు.. హైదరాబాదీలకు హెచ్చరిక!
- IndiaGlitz, [Wednesday,September 25 2019]
హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో గత వారం రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. రోజులో అరగంట గ్యాప్ ఇచ్చి వర్షం దంచికొడుతోంది. దీంతో ఇళ్లలో నుంచి బయటికి రావాలన్నా.. ఇంటి నుంచి బయటికెళ్లిన వాళ్లు రావాలన్నా హైదరాబాదీలు జంకుతున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడం.. విద్యుత్ సరఫరా నిలిచిపోవడం.. ఎక్కడికక్కడ భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో అసలేం చేయాలో తెలియక హైదరాబాద్ నగర వాసులు నానా తిప్పలు పడుతున్నారు.
ఎక్కడివాళ్లు అక్కడే ఆగిపోండి!!
ఇక విషయానికొస్తే.. బుధవారం నాడు తెల్లవారు జామున మొదలైన వర్షం ఎడతెరిపి లేకుండా ఇప్పటికీ కురుస్తూనే ఉంది. ఈ క్రమంలో వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్‌లో మరో 2 గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ‘ప్రజలు ఇళ్లలోంచి బయటికి రావొద్దు. ఉద్యోగాలకు వెళ్లిన వారు కూడా మీ.. మీ ఆఫీసుల నుంచి ఆలస్యంగా బయలుదేరండి.. ఎక్కడి వాళ్లు అక్కడే నిలిచిపోండి. 13 రెస్క్యూ టీమ్‌లను అప్రమత్తం చేశాము. ఈ టీమ్‌లు అన్నీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూసుకుంటారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విధాలా ఏర్పాట్లు చేశాము’ అని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ తెలిపారు.
ఇటీవల హైదరాబాద్‌లో కురిసిన వర్షాలు నగర చరిత్రలో ఎప్పుడూ పడలేదని పలువురు భాగ్యనగరవాసులు వాపోతున్నారు. మొత్తానికి చూస్తే జీహెచ్ఎంసీ చేసిన కీలక ప్రకటనతో జనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయారు. మరి వర్షం ఎప్పుడు పడుతుందో..? ఎప్పుడు తెరపిడిస్తుందో ఆ వానదేవుడికే తెలియాలి.