Pawan Kalyan:దుర్గమ్మకు పవన్ సమర్పించిన 'చీర' .. మాకంటే మాకు, పై స్థాయిలో అధికారులపై ఒత్తిడి
- IndiaGlitz, [Thursday,February 09 2023]
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైయున్న కనకదుర్గమ్మ భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజూ రెండు రాష్ట్రాలతో పాటు సమీప రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు దుర్గమ్మను దర్శించుకుని , మొక్కులు చెల్లించుకుంటారు. పసుపు, కుంకుమతో పాటు బంగారం, వెండి ఇతర రూపేణా హుండీలో వేస్తారు. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది చీరలు. ప్రతిరోజూ భక్తులు వేల సంఖ్యలో అమ్మవారికి చీరల్ని సమర్పిస్తూ వుంటారు. ఇందులో సామాన్యుల నుంచి ప్రముఖులు సమర్పించే చీరలు వుంటాయి. వీటిని దేవస్థానం అధికారులు వేలం వేస్తూ వుంటారు. వీటిని దక్కించుకోవడానికి భక్తులు పోటీపడుతూ వుంటారు. ప్రస్తుతం ఈ చీరల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమర్పించిన చీర వుండటంతో దానిని సొంతం చేసుకునేందుకు పవన్ అభిమానులు, ప్రజలు పోటీపడుతున్నారు.
గత నెలలో దుర్గమ్మను దర్శించుకున్న పవన్ :
గత నెలలో కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు జరుపుకున్న అనంతరం.. నేరుగా తన వారాహి వాహనంతో పాటు విజయవాడకు వచ్చారు పవన్ కల్యాణ్. కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న ఆయన.. చీరను సమర్పించారు. ఎనిమిది వేల విలువైన ఆ చీర అప్పట్లోనే చాలా మందిని ఆకట్టుకుంది. ఇప్పుడు దానిని అధికారులు వేలం వేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించడంతో దానిని ఎంతైనా సరే ఖర్చు చేసే దక్కించుకోవాలని అభిమానులు పోటీపడుతున్నారట. ధర ఎంతైనా సరే పర్లేదు కొంటామంటూ ప్రజలు ఓ కాంట్రాక్టర్‌పై ఒత్తిడి తీసుకొస్తున్నారట.
గతంలో మెగాస్టార్ బహూకరించిన చీరకు విపరీతమైన పోటీ:
గతంలో మెగాస్టార్ చిరంజీవి దంపతులు సమర్పించిన చీర విషయంలోనూ అభిమానులు సదరు కాంట్రాక్టర్‌ను విసిగించారట. దీంతో అతను ఏం చేయాలో తెలియక అదే ఫ్యామిలీకి చెందిన వ్యక్తులు విజయవాడ వస్తే ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. దీనిలో భాగంగా అప్పట్లో ఇంద్రకీలాద్రికి వచ్చిన అల్లు అరవింద్ దంపతులకు కానుకగా ఇవ్వడంతో విషయం సద్దుమణిగింది. మరిప్పుడు పవన్ కల్యాణ్ విషయంలో ఆలయ అధికారులు ఏం చేస్తారో వేచి చూడాలి.