Chandrababu: చంద్రబాబుకు గుండె సమస్య.. ఏపీ హైకోర్టుకు వైద్యుల నివేదిక..
- IndiaGlitz, [Wednesday,November 15 2023]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఏపీ హైకోర్టుకు ఆయన తరపు న్యాయవాదులు నివేదిక సమర్పించారు. అయితే ఈ నివేదికలో కీలక విషయాలు వెల్లడించారు. చంద్రబాబుకు కంటి ఆపరేషన్ చేసిన వైద్యులు.. ఆయన తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నివేదికలో పేర్కొన్నారు. ఆయన కుడి కంటికి ఆపరేషన్ నిర్వహించామని.. కోలుకునేందుకు సమయం పడుతుందని సూచించారు. ఐదు వారాల పాటు కంటి చెకప్ కోసం షెడ్యూల్ కూడా ఇచ్చామని తెలిపారు. ఈ 5 వారాల పాటు ఇన్‍ట్రా ఆక్యులర్ ప్రెజర్ చెక్ చేసుకోవటంతో పాటు కంట్లో చుక్కల మందులు వేసుకోవాలని సూచనలు ఇచ్చారు.
మరోవైపు చంద్రబాబు గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్టుగా నివేదికలో తెలిపారు. చంద్రబాబు గుండె పరిమాణం పెరిగిందని.. గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాల్లో సమస్యలున్నాయని పేర్కొన్నారు. అందుచేత ఆయనకు తగినంత విశ్రాంతి అవసరమని సూచించారు. షుగర్ అదుపులోనే ఉందని.. అయితే తగిన జాగ్రత్తలు పాటించాలని వివరించారు. గుండె సమస్యతో పాటు ఎలర్జీని కంట్రోల్ చేసేందుకు మూడు నెలల పాటు చికిత్స అవసరమని వైద్యులు హైకోర్టుకు ఇచ్చిన నివేదికలో పొందుపరిచారు. అలాగే ప్రజా జీవితంలో ఉన్నప్పుడు చంద్రబాబు వెంట 24 గంటల పాటు ACLS అంబులెన్స్‌తో పాటు ట్రెయిన్డ్ డాక్టర్ కూడా కచ్చితంగా అందుబాటులో ఉండేలా చూసుకోవాలని వెల్లడించారు.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా చంద్రబాబు తరపు లాయర్లు వైద్యుల నివేదికను న్యాయమూర్తికి సమర్పించారు. విచారణలో భాగంగా సీఐడీ తరపున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఈరోజు వాదనలు వినిపించారు. అనంతరం చంద్రబాబు న్యాయవాదులు ఇచ్చిన నివేదికను పరిశీలించిన న్యాయమూర్తి మిగిలిన వాదనలు రేపు(గురువారం) వింటామని విచారణను వాయిదా వేశారు.