Chandrababu: సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ శుక్రవారానికి వాయిదా
- IndiaGlitz, [Tuesday,October 10 2023]
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. శుక్రవారం మధ్యాహ్నం 2గంటలకు తదుపరి వాదనలు వింటామని జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ అనిరుధ్ బోస్‌లతో కూడిన ధర్మాసనం తెలిపింది. విచారణ సందర్భంగా చంద్రబాబు తరపున హరీశ్ సాల్వే, ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి తమ వాదనలు వినిపించారు. అయితే వాదనలకు మరో గంట సమయం కావాలని ఇరువైపు న్యాయవాదులు కోరగా.. అత్యవసర కేసులు విచారణ ఉన్నందున శుక్రవారానికి విచారణ వాయిదా వేసింది. ఆ రోజే తుది తీర్పు వెల్లడయ్యే అవకాశం ఉంది.
ముకుల్ రోహత్గీకి ధర్మాసనం పలు ప్రశ్నలు..
వాదనలు సందర్భంగా ప్రభుత్వం తరపు లాయర్ ముకుల్ రోహత్గీకి ధర్మాసనం పలు సందేహాలు వ్యక్తం చేసింది. 17A నేరానికి వర్తిస్తుందా ? నిందితులకు వర్తిస్తుందా? 2018లో విచారణ ప్రారంభించినప్పుడు ఏమి కనిపెట్టారు? అని జస్టిస్ బేలా త్రివేది ప్రశ్నించారు. అవినీతికి సంబంధించిన సెక్షన్ అమలు కాకపోతే మిగతా సెక్షన్స్ కింద ప్రత్యేక కోర్టు విచారించవచ్చా ? మిగతా సెక్షన్స్ కింద పెట్టిన కేసులు చెల్లుతాయా? లేదా? అని ప్రశ్నలు వేశారు.
క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాడివేడి వాదనలు..
చంద్రబాబు తరఫున సీనియర్ లాయర్ హరీశ్ సాల్వే, సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తున్నారు. 17ఏ అంశం చుట్టూనే వాడివేడి వాదనలు జరగుతున్నాయి. ఈ కేసులో నోటీసులు జారీ చేయాలని రోహత్గీ వాదించగా.. సాల్వే ఈ వాదనలను సాల్వే తోసిపుచ్చారు. అలాగే హైకోర్టులో దాఖలు చేసిన పత్రాల ఆధారంగానే వాదనలు జరుగుతున్నప్పుడు కొత్త డాక్యుమెంట్ల అవసరం ఉండదని జస్టిస్ బేలా ఎం.త్రివేది తెలిపారు. నోటీసులు కోర్టు విధానాల్లో భాగమని రోహత్గీ వాదించగా నోటీసులు అవసరం లేదన్న దానిపై ఆధారాలేమైనా ఉన్నాయా.? అని సాల్వేను న్యాయమూర్తి ప్రశ్నించారు. దీనికి స్పందిస్తూ గతంలో ఇచ్చిన తీర్పులను బెంచ్ ముందుంచుతానని సాల్వే పేర్కొ్‌న్నారు. స్కిల్ స్కాం కేసు మూలంలోనే దోషం ఉందని సాల్వే పేర్కొన్నారు. స్కిల్ కేసులో చంద్రబాబుపై నమోదైన ఎఫ్ఐఆర్ చట్టబద్ధం కాదని అందుకే దాన్నే సవాల్ చేస్తున్నట్లు వివరించారు.
ఈ కేసులో చంద్రబాబుపై రాజకీయ కక్ష లేదు..
స్కిల్ స్కాం కేసులో 2018 పీసీ చట్ట సవరణకు ముందే నేరం జరిగిందని సీఐడీ తరఫు లాయర్ ముకుల్ రోహత్గీ ధర్మాసనానికి తెలిపారు. చంద్రబాబుపై తగినన్న ఆధారాలు దొరికిన తర్వాత 2021లో కేసు నమోదు చేసినట్లు చెప్పారు. కేసులో చంద్రబాబు పేరును ఎప్పుడు చేర్చినా కేసు విచారణ కొనసాగుతున్నట్లుగానే పరిగణించాలని కోరారు. చట్ట సవరణకు ముందున్న నేరం కాబట్టే 17ఏ వర్తించదని స్పష్టంచేశారు. ఇందులో ఎలాంటి రాజకీయ కక్ష లేదని రోహత్గీ వెల్లడించారు.