శశిథరూర్ తలకు తీవ్ర గాయాలు
- IndiaGlitz, [Monday,April 15 2019]
కాంగ్రెస్ ఎంపీ, యునైటైడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) తిరువనంతపురం ఎంపీ అభ్యర్థి శశి థరూర్ తీవ్రంగా గాయపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక దేవాలయంలో ఆయన పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తులాభారం నిర్వహించారు. మరికాసేపట్లో తులాభారం పూర్తవుతుందనగా అపశృతి చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. సోమవారం రోజున శశి థరూర్ అరటిపళ్లతో తులాభారం ఇచ్చారు. కేరళ, తిరువనంతపురంలోని గాంధారి అమ్మాన్ దేవాలయంలో ఈ తులాభారం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇంతలో తులాభారం కోసం కూర్చున్న త్రాసు ఒక్కసారిగా తెగి కిందపడింది. ఈ ఘటనలో ఆయన కాలికి, తలకు గాయమైంది.
దీంతో ఆయన తలకు, కాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయం స్థానికుడు ఒకరు మీడియాకు వెల్లడించారు. హుటాహుటిన థరూర్ను స్థానికంగా ఉన్న ప్రభుత్వాస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఆయన తలపై 6 కుట్లు పడ్డాయని వైద్యులు చెబుతున్నారు. కాగా మెరుగైన చికిత్స కోసం శశి థరూర్ను తిరువనంతపురం మెడికల్ కాలేజీకి తరలించినట్టు చెప్పారు. ప్రస్తుతం ఆయన క్షేమంగా ఉన్నారని డాక్టర్లు తెలిపారు. కాగా.. విషు డే ( కేరళ ఉగాది) సందర్భంగా తులాభారం నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. హిందూ పర్వదినాల్లో తమ బరువుకు సరితూగే ధన, వస్తు రూపేణా దేవుడికిచ్చే కానుకే తులాభారం అన్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. తిరువనంతపురం లోక్సభ నియోజకవర్గం నుంచి ఇప్పటికే వరుసగా రెండు సార్లు గెలిచిన శశిథరూర్.. వచ్చే ఎన్నికల్లోనూ మరోసారి ఇదే స్థానం నుంచి బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో భాజపా అభ్యర్థి కుమ్మనం రాజశేఖరన్, సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ అభ్యర్థి దివకరణ్తో ఆయన పోటీపడనున్నారు. కేరళలో ఏప్రిల్ 23న లోక్సభ ఎన్నికలు జరగనున్న విషయం విదితమే.