మీడియా మొఘల్ రామోజీరావు చేతుల మీదుగా 'హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య' మొదలైంది
Send us your feedback to audioarticles@vaarta.com
శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ తెరకెక్కిస్తున్న చిత్రం `హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య`. ఆర్.నారాయణమూర్తి, జయసుధ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చదలవాడ పద్మావతి నిర్మాత. చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో బుధవారం ఉదయం జరిగింది. మీడియా మొఘల్ రామోజీరావు ఈ కార్యక్రమంలో పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్‌నిచ్చారు. ఫిల్మ్ సిటీ ఎండీ రామ్మోహన్రావు కెమెరా స్విచ్చాన్ చేశారు. ఎస్వీ కృష్ణారెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు.
ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ ``ఈ చిత్ర దర్శకుడు చదలవాడ శ్రీనివాసరావుకు సినిమాల పిచ్చి ఉండేది. వాళ్ల పెద్దన్నకు అది నచ్చేది కాదు. కానీ చిన్నన్న ఆయన్ని ప్రోత్సహించి సినిమా రంగంలో గొప్పగా చూస్తున్నారు. ఆయనతో ఈ సినిమా చేయడం ఆనందంగా ఉంది. నేను ఇందులో హెడ్‌కానిస్టేబుల్‌గా నటిస్తున్నాను. నేను ఏ సినిమా చేసినా సరే పోలీసు తమ్ముళ్లు నా దగ్గరకొచ్చి అన్నా మా వేషం వేయొచ్చుకదా... అని అడిగేవారు. తప్పకుండా చేస్తానని గతంలో మాటిచ్చాను. ఈ సినిమాతో నా మాట నెరవేర్చుకునే అవకాశం వచ్చింది. కథ వినగానే ఈ వేషం వేయాలనిపించింది. చేస్తున్నాను. నాకు సావిత్రిగారంటే ఇష్టం. ఆ తర్వాత జయసుధగారి నటనంటే ఇష్టం. జయసుధగారితో చేయడం ఆనందంగా ఉంది`` అని అన్నారు.
చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ `` సినిమా చాలా పవర్ఫుల్ మీడియా. ఎప్పుడూ అడ్వాన్స్ గా ఆలోచిస్తుంది. అప్పుడెప్పుడో తీసిన `మాయాబజార్`లో టీవీలను చూపించారు. రామోజీరావుగారు తీసిన `మయూరి` ఎంత స్ఫూర్తి నింపిందో తెలిసిందే. ఈ మధ్య మేం తీసిన `బిచ్చగాడు` కూడా చాలా మంచి సినిమాగా ఆడింది. ఐదేళ్ల క్రితం రామోజీరావుగారు `అర్థక్రాంతి` అనే మీటింగ్‌ను పెట్టారు. అందులో చర్చించిన అంశం నన్ను చాలా కాలం వెంటాడింది. బ్లాక్ మనీ వల్ల ఎంత నష్టం జరుగుతోంది.., మరీ ముఖ్యంగా మధ్య తరగతి వాళ్లు ఎలా దాని వల్ల నష్టపోతున్నారు వంటి అంశాల గురించి ఆలోచించాను. డబ్బు ఒకచోట ఆగిపోవడం వల్ల ఉద్యోగం ఉండదు. ఫ్లోటింగ్ ఉండదు. అందుకే ప్రభుత్వం ఈ విషయంలో చర్యలు తీసుకోవాలి. ట్రాన్సాక్షన్స్ అన్నీ బ్యాంకుల ద్వారా జరగాలి అనే కాన్సెప్ట్ తో అల్లుకున్నాం. నారాయణమూర్తిగారికి కథ నచ్చి చేయడానికి ఒప్పుకున్నారు. జయసుధగారు ఫోన్లో విని చేస్తానన్నారు. ఈ రోజు నుంచి ఈ సినిమా మొదలైంది. కంటిన్యూయస్‌గా ఒకే షెడ్యూల్లో తీస్తాం. జనవరిలో విడుదల చేస్తాం. వందేమాతరం సంగీతంలో ఇప్పటికే పాటలను రికార్డ్ చేశాం. ఏసుదాస్‌గారు, బాలుగారు, కీరవాణిగారు పాటలను పాడారు. చాలా బాగా వచ్చాయి`` అని చెప్పారు.
జయసుధ మాట్లాడుతూ ``ఈ చిత్రం నాకు చాలా స్పెషల్. నేను హీరోయిన్గా చేసేటప్పుడు కొన్ని కథలు, కాంబినేషన్లు వినగానే కొత్తగా అనిపించేది. ఈ సినిమా నాకు అలాగే అనిపిస్తోంది. నారాయణమూర్తిగారు ఎప్పటి నుంచో తెలుసు. అయితే ఆయన పక్కన చేయడం ఇదే తొలిసారి. యాక్టర్‌గా ఆయనంటే నాకు ఇష్టం. కెమెరా ముందు మేమిద్దరం పోటాపోటీగా నటించాలనుకుంటున్నాం`` అని అన్నారు.
చదలవాడ తిరుపతిరావు మాట్లాడుతూ ``మాది తెనాలి. ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆర్.నారాయణమూర్తి మా మనిషి. మా సంస్థలో జయసుధ చాలా సినిమాలు చేసింది. ఈ మధ్యనే మేం `బిచ్చగాడు` అనే సినిమా చేశాం. ఈ సినిమా మార్కెటింగ్‌కి మయూరి ఫిల్మ్స్ హెల్ప్ చేశారు. తాజా చిత్రాన్ని షోలే, ఖుర్బానీతో పోలుస్తున్నారు. మేం వరుసగా 20 సినిమాలను ఫిల్మ్ సిటీలో చేస్తాం`` అని చెప్పారు.
చలపతిరావు మాట్లాడుతూ ``ఈ ఏడాది వరుసగా సినిమాలు చేస్తానని అంటున్నారు ఈ నిర్మాతలు. సొసైటీకి ఉపయోగపడేలా ఆ సినిమాలు ఉంటాయని భావిస్తున్నాను`` అని అన్నారు.
వై.విజయ మాట్లాడుతూ ``టైటిల్ వినగానే సినిమా హిట్ అనిపించింది. ఈ పాత్రని మీరే చేయాలని ఈ నిర్మాత చెప్పారు. అలాంటి నిర్మాత ఉండటం చాలా అదృష్టం`` అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో జె.పి., విజయ భాస్కర్, వెన్నెల కిశోర్, సమీర్, సునీల్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
సునీల్ శర్మ, జయప్రకాశ్ రెడ్డి, తనికెళ్ల భరణి, చలపతిరావు, వెన్నెల కిశోర్, వై.విజయ, సమీర్, విజయ భాస్కర్, విజయ్, పార్వతి తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: వందేమాతరం శ్రీనివాస్, డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: కె.సుధాకర్ రెడ్డి, ఎడిటర్: మోహన రామారావు, నృత్యాలు: శివసుబ్రహ్మణ్యం, ఫైట్స్: సతీష్ మాస్టర్, సమర్పణ: చదలవాడ తిరుపతిరావు, నిర్మాత: చదలవాడ పద్మావతి, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: చదలవాడ శ్రీనివాసరావు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com