బర్గర్ కోసం రూ.2 లక్షలు ఖర్చు చేశాడు..
- IndiaGlitz, [Monday,December 07 2020]
బర్గర్ తినాలి అనిపిస్తే ఏం చేస్తాం? దగ్గరలో ఏదైనా బర్గర్ షాప్ ఉందో చూస్తాం.. లేదంటే వదిలేస్తాం.. అంతేకానీ దాని కోసం వందల మైళ్ల దూరమైతే ప్రయాణించే ప్రోగ్రాం అయితే పెట్టుకోం. పైగా వంద రూపాయలుంటే బర్గర్ కోసం రూ.2 లక్షలైతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఖర్చు పెట్టలేం. కానీ ఓ వ్యక్తి మాత్రం బర్గర్ కోసం తన స్నేహితురాలితో కలిసి 450 మైళ్ల దూరం ప్రయాణించాడు. అతి కూడా ఒక హెలికాఫ్టర్‌ను బుక్ చేసుకుని.. మొత్తం మీద బర్గర్‌ని అయితే తిన్నారు కానీ దాని కోసం అయిన ఖర్చే నెటిజన్లతో నోరెళ్ల బెట్టిస్తోంది.
రష్యాకు చెందిన విక్టోర్ మార్టినోవ్(33) అనే మిలియనీర్ తన స్నేహితురాలితో కలిసి క్రిమియాలోని ఆలుస్తాకు విహారయాత్రకు వెళ్లాడు. అయితే ఆలుస్తాలో తనకు రుచికరమైన ఆహారం దొరకలేదు. దీంతో మెక్‌డొనాల్డ్‌కి వెళ్లి బర్గర్ తినాలని భావించాడు. కానీ అక్కడి నుంచి మెక్‌డొనాల్డ్ అవుట్‌లెట్‌కి వెళ్లాలంటే కనీసం 450 మైళ్లు ప్రయాణించాలని తెలిసింది. ఆ సమయంలో మార్టినోవ్‌కి డబ్బు ముఖ్యం కాదని అనిపించింది. వెంటనే ఒక హెలికాఫ్టర్‌ను బుక్ చేసుకున్నాడు. తన స్నేహితురాలితో కలిసి మెక్‌డొనాల్డ్ అవుట్‌లెట్‌కి వెళ్లాడు.
మార్టినోవ్ జంటకు నచ్చిన ఆహారాన్ని ఆనందంగా తినేశారు. నచ్చిన ఆహారాన్ని తినేందుకైన ఖర్చు 49 పౌండ్లు అంటే మన కరెన్సీలో రూ.5000 అయితే.. తమ ప్రయాణానికి అయిన ఖర్చు 200 పౌండ్లు.. అంటే మన కరెన్సీలో అక్షరాలా రెండు లక్షల రూపాయలు. దీనికి సంబంధించిన రికార్డింగ్‌ను సోషల్ మీడియాలో మార్టినోవ్ షేర్ చేశాడు. అది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. తను, తన స్నేహితురాలు ఆర్గానిక్ ఫుడ్‌తో విసిగిపోయామని.. అందుకే తమకు నచ్చిన ఆహారం కోసం హెలికాఫ్టర్ బుక్ చేసుకున్నామని వెల్లడించాడు. అక్కడ బర్గర్లు తిని తిరిగి వచ్చేశామని.. ఈ ప్రయాణం తమకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని మార్టినోవ్ వెల్లడించాడు.