Ramgopal Varma:ఏపీ సీఎం ఎవరో తనకు తెలియదు: రామ్‌గోపాల్ వర్మ
- IndiaGlitz, [Friday,December 15 2023]
వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మరోసారి వార్తల్లో నిలిచాడు. దివంగత సీఎం వైఎస్సార్ మరణించిన తర్వాత ఆయన తనయుడు జగన్ మోహన్ రెడ్డి చుట్టూ జరిగిన పరిస్థితుల ఆధారంగా రెండు పార్టులుగా సినిమా తీసిన సంగతి తెలిసిందే. అందులో మొదటి పార్ట్ ‘వ్యూహం’ సినిమా డిసెంబర్ 29న రిలీజ్ కానుంది. రెండవ పార్ట్ ‘శపథం’ జనవరి 25న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే 'వ్యూహం' సినిమా నవంబర్‌లోనే విడుదల కావాల్సి ఉండగా.. సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడంతో వాయిదా పడింది. తాజాగా ఈ సినిమాకు సెన్సార్ రావడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టాడు ఆర్జీవీ.
ఇప్పటికే ఈ సినిమా నుంచి పాటలు, టీజర్, ట్రైలర్ రిలీజవ్వగా తాజాగా మరో ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన ట్రైలర్ లాంచ్ ప్రెస్ మీట్‌లో ఆర్జీవీ కీలక వ్యాఖ్యలు చేశాడు. అరచేతిని అడ్డుపెట్టి వ్యూహం సినిమాను ఆపలేరు అని గతంలోనే చెప్పానని తెలిపాడు. ఏం మాయచేసి క్లీన్ యు సర్టిఫికెట్ తెచ్చారు అని తనను అడగొద్దన్నాడు. దావూద్ ఇబ్రహీంతో ఫోన్ చేయించడం వల్ల సినిమాకు సెన్సార్ చేశారంటూ వెటకారం చేశాడు. ఏపీ సీఎం తనకు పరిచయం లేదన్నారు. వైఎస్ఆర్ చనిపోయిన తరువాత ఏం జరిగింది అనే కథే వ్యూహం సినిమా అన్నాడు.
ఇందులో అన్ని అంశాలను టచ్ చేశానని... గతంలో బయట వాళ్లు మైక్స్ దగ్గర ఏమీ చెప్పారో అదే ప్రజలకు తెలుసన్నాడు. కానీ వాళ్ల బెడ్ రూమ్, బాత్ రూమ్ విషయాలు ఇందులో చూపించానని పేర్కొన్నాడు. అన్ని క్యారెక్టర్లు ఫిక్షనల్ క్యారెక్టర్స్ అన్నారు. తాను ఏమీ చూపించాను అనేది సినిమా చూస్తే తెలుస్తుంది అని వివరించాడు. చంద్రబాబు అంటే తనకు రసగుల్లా కన్నా ఇష్టమని సెటైర్లు వేశాడు. తెలంగాణలో కేసీఆర్ ఓటమి ఓ కంట కన్నీరు అయితే రేవంత్ రెడ్డి గెలుపు మరో కంట పన్నీరులా ఉందని వ్యాఖ్యానించాడు. తెలంగాణలో ఉన్నంత బలమైన ప్రతిపక్షం ఏపీలో లేదని చెబుతూ.. తాను ఎవ్వరికీ ఓటు వెయ్యమని చెప్పనంటూ వెల్లడించాడు.