రాజకీయాలకు ‘ఇక సెలవు’ అంటున్న కుమారన్న!
Send us your feedback to audioarticles@vaarta.com
అవును మీరు వింటున్నది నిజమే.. కర్నాటక మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే రాజకీయాల నుంచి తప్పుకునే యోచనలో ఉన్నట్లు తన మనసులోని మాటను కుమారన్న బయటపెట్టారు. అయితే తాను ఎందుకు రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నానో నిశితంగా వివరించి మరీ చెప్పారాయన. అసలు ఆయన ఎందుకు ఇలా మాట్లాడారు..? ఈ కీలక నిర్ణయం వెనకున్న బలమైన కారణాలేంటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అసలెవరీ కుమారన్న!?
మాజీ ప్రధాని దేవెగౌడకు సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉందన్న విషయం తెలిసిందే. దేవెగౌడ జేడీఎస్ పార్టీని స్థాపించారు. ఆయన తర్వాత అదే కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తులు రేవణ్ణ, కుమారస్వామి. అంతకుమునుపు కన్నడనాట టాప్ సినిమాలను నిర్మిస్తూ ప్రొడ్యూసర్‌గా కుమారస్వామి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు.. ఓ స్టార్ హీరోయిన్‌గా ఈయన రెండో పెళ్లి చేసుకున్నారు. ఆమె ఇప్పటికీ హీరోయిన్‌గానే కొనసాగుతున్నారు కూడా. అలా అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన.. అనుకోకుండానే సీఎం కూడా అయ్యారు. ఒకసారే ఏకంగా రెండుసార్లు సీఎం అయ్యి కర్నాటక ప్రజలకు సేవ చేసుకున్నారు. అయితే తాజాగా రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని అనుకుంటున్నట్లు కుమారస్వామి చేసిన ప్రకటనతో కన్నడ నాట రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
కుమారన్న ఏమన్నారు..?
" నేను కన్నడనాట నిర్మాతగా జీవితం ప్రారంభించాను. అనుకోఅనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చా.. అనుకోకుండానే సీఎంను అయ్యాను. రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఆ భగవంతుడు నాకు కల్పించారు. ఎవరినో సంతృప్తిపరిచేందుకు నేను రాజకీయాల్లో లేను. నేను రెండోసారి సీఎం అయినప్పుడు 14నెలలు ప్రజల కోసం పనిచేశాను. రాష్ట్రాభివృద్ధి కోసమే పనిచేశాను.. నేను చేసిన కొద్దిరోజులైనా సంతృప్తిగానే పనిచేశాను" అని కుమారస్వామి ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు.
రాజకీయాలు ఎటుపోతున్నాయ్..!
"ప్రస్తుతం రాజకీయాలు ఎటువైపు పోతున్నాయో అర్థం కావట్లేదు.. వీటన్నింటినీ నేను గమనిస్తున్నాను. రాజకీయాలు మంచి వాళ్ల కోసం కాదు. రాజకీయాలు అంటే కుల సమీకరణాలతో కూడుకున్నవి మాత్రమే. ఈ కులాల రొంపిలోకి దయచేసి నా కుటుంబాన్ని లాగొద్దు. నేను ప్రశాంత జీవనాన్ని గడపాలనకుంటున్నాను. అందుకే నేను రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. నేను అధికారంలో ఉన్నప్పుడు మంచే చేశాను తప్ప ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు. ప్రజల గుండెల్లో నాకూ కొంత చోటు ఉండాలని కోరుకుంటున్నాను" అని కుమారస్వామి హాట్ హాట్ వ్యాఖ్యలు చేశారు.
కింగ్ మేకర్.. కన్నీళ్లు.. పీఠం దిగేశారు!
ఇదిలా ఉంటే.. 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలోకి మేజిక్ ఫిగర్ సీట్లు రాకపోవడంతో కుమారస్వామి కింగ్ మేకర్ అయిన సంగతి తెలిసిందే. జాతీయ పార్టీ అయినా కాంగ్రెస్సే ఓ మెట్టు దిగొచ్చి జేడీఎస్ చేతులు కలిపి.. కుమారన్నను సీఎం చేయడంతో జేడీఎస్‌కు చెందిన పలువుర్ని కేబినెట్‌లోకి చేర్చింది. అయితే ఈయన సీఎం పీఠమెక్కిన మరుసటి రోజు నుంచే వివాదాలే వివాదాలు. ఇటు బీజేపీ.. అటు కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ పెద్దలు ముప్పుతిప్పలు పెట్టారు.! ఆఖరికి ఆయన్ను సీఎం పీఠం నుంచి దిగబెట్టేశాయి. కేవలం 14 నెలలు మాత్రమే.. ఈయన సీఎంగా పనిచేశారు. కాగా.. అసహనం, అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు కోకొల్లలు. అంతేకాదు ఎన్నోసార్లు మీడియా ముందుకొచ్చి కుమారన్న కన్నీళ్లు సైతం పెట్టుకున్నారు.
అయితే.. కుమారన్న ప్రకటనతో కన్నడనాట రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ ప్రకటనపై కాంగ్రెస్ నేతలు, జేడీఎస్ నేతలు, దేవెగౌడ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments