కొవాగ్జిన్ తీసుకున్నారా? అయితే ఆ దేశాల్లోకి నో ఎంట్రీ..
- IndiaGlitz, [Monday,May 24 2021]
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికే తమ దేశాల్లోకి ఎంట్రీ అనే నిబంధనను పలు దేశాల్లో అమల్లోకి తెస్తున్నాయి. ఈ క్రమంలోనే గల్ఫ్ దేశాలు నిబంధనలకు సిద్ధమవుతున్నాయి. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న విదేశీయులకు మాత్రమే అనుమతిస్తామంటూ సౌదీ అరేబియా తాజాగా ప్రకటించింది. అయితే కొన్ని వ్యాక్సిన్లు తీసుకున్న వారికి మాత్రమే తమ దేశంలోకి సౌదీ అరేబియా అనుమతి ఇవ్వనుంది. ఫైజర్, ఆస్ట్రాజెనెకా, మోడెర్నా, జాన్సన్ వ్యాక్సిన్లు తీసుకున్న వారు అందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను ఎయిర్‌లైన్స్‌కు సమర్పించిన తర్వాతే దేశంలోకి అనుమతిస్తామని పేర్కొంది.
గల్ఫ్‌లోని ఇతర దేశాల వారికి కూడా ఇదే రకమైన నిబంధనలను అమలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. గల్ఫ్, ఉత్తర అమెరికా, ఐరోపా దేశాలేవీ భారత్ ఉత్పత్తి చేసే కొవాగ్జిన్‌ను గుర్తించలేదు. అంతేకాదు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ టీకాను తన జాబితాలో ప్రకటించలేదు. కానీ భారతీయులు మాత్రం చాలా మంది కొవాగ్జిన్ వైపే మొగ్గు చూపుతున్నారు. సెలవులపై మాతృదేశానికి వెళ్లిన అనేక మంది ప్రవాసీయులు తమ ఆధార్ కార్డుల ఆధారంగా కొవాగ్జిన్‌ను తీసుకున్నారు. వీరికి సౌదీ ప్రభుత్వం అనుమతిని నిరాకరించింది. అయితే ఆధార్ కార్డులను కాకుండా పాస్ పోర్టులను మాత్రమే విమానయాన సంస్థలు గుర్తిస్తాయి.
ఇటీవల బహ్రెయిన్ మీదుగా రోడ్డు మార్గాన సౌదీ అరేబియాకు వచ్చిన అనేక మంది భారతీయులను అక్కడి అధికారులు వెనక్కి పంపించారు. వ్యాక్సిన్ దౌత్యం పేర మోదీ సర్కారు విదేశాలకు పంపిన టీకాల్లో అత్యధికంగా కొవిషీల్డ్ ఉన్నాయి. దీంతో.. ప్రస్తుతం భారత్‌లో ఎక్కువగా కొవాగ్జిన్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో ప్రవాసీయులంతా కొవాగ్జిన్‌ను తీసుకున్నారు. అయితే ఇప్పుడు కొవాగ్జిన్ రెండు డోసులు తీసుకున్న ప్రవాసీయులు అంతర్జాతీయ ప్రయాణాల్లో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సకాలంలో వెళ్లలేక ఉద్యోగాలు కోల్పోతారనే ఆందోళన వారిలో నెలకొంది.