ఎన్నికల కమిషన్ను కేసీఆర్ మోసం చేశారా!?
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు అయిపోయాయ్.. ఫలితాలు కూడా వచ్చేశాయ్.. మళ్లీ గులాబీ బాస్ కేసీఆరే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కచ్చితంగా గెలుస్తామనే ధీమాతో ఉన్న ఉద్ధండులు.. ఊహించని ఫలితాలు రావడంతో అసలేం జరిగింది..? ఎక్కడ తేడా కొట్టిందబ్బా అనే ఆలోచనలో పడ్డారు నేతలు. టీఆర్ఎస్ తరఫున పోటీచేసి ఓడిపోయిన నలుగురు మంత్రులు, జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డీకే అరుణ, రేవంత్ రెడ్డిలాంటి కీలక నేతలు అసలు ఎలా ఓడిపోయారో వారికే అంతుచిక్కని పరిస్థితి. దీంతో తమకు ప్రజలు ఓటేసి గెలిపించారని.. అయితే మధ్యలో ఏదో జరిగిందని కాంగ్రెస్ అభ్యర్థులు హైకోర్టు మెట్లెక్కుతున్నారు. ఇటీవల టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలంటూ రేవంత్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
కేసీఆర్పై పిటిషన్..!
అయితే తాజాగా.. టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆయన సొంత నియోజకవర్గానికి చెందిన ఒక ఓటరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల అఫిడవిట్ లో కేసీఆర్ తప్పుడు సమాచారం ఇచ్చారని శ్రీనివాస్ తన పిటిషన్లో పేర్కొన్నారు. కేసీఆర్పై మొత్తం 64 క్రిమినల్ కేసులు ఉన్నాయని... అయితే మొదటి అఫిడవిట్ లో 2 కేసులు మాత్రమే ఉన్నట్టు చూపారని తెలిపారు. అఫిడవిట్లో తప్పుడు సమాచారాన్ని ఇచ్చిన కేసీఆర్ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని కోర్టును కోరారు. కాగా పిటిషన్ స్వీకరించిన హైకోర్టుకు సోమవారం విచారణ జరుగుతుందని స్పష్టం చేసింది.
అయితే.. కేసీఆర్ రాజకీయ అరంగేట్రం చేసిన నాటి నుంచే ఆయనపై కేసులు చాలానే ఉన్నాయన్నది తెలిసిందే. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ హయాంలో, ఉద్యమ సమయంలో కేసీఆర్పై చాలానే కేసులు పెట్టారన్న విషయం జగమెరిగిన సత్యమే. అయితే ఆ తర్వాత చాలా వరకు కొట్టివేయబడ్డాయి. తాజా పిటిషన్లో మాత్రం ఒకటి రెండు కాదు ఏకంగా 64 క్రిమినల్ కేసులున్నాయని కోర్టుకెక్కడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. అయితే నిజంగానే కేసీఆర్.. ఎన్నికల కమిషన్ను మోసం చేశారా..? అసలేం జరిగింది..? అనే విషయాలు తెలియాలంటే కోర్టు తీర్పు వచ్చే వరకు వేచి చూడాల్సిందే మరి. కాగా ఇంత వరకూ ఈ వ్యవహారంపై గులాబీ నేతలు మాత్రం స్పందించకపోవడం గమనార్హం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout