ఫొటోలు పెట్టి టీడీపీని ఇరకాటంలో పెట్టిన ‘గంటా’!?
- IndiaGlitz, [Sunday,May 05 2019]
ఫొటోలా..? ఇంతకీ ఆ ఫొటోలు ఏంటబ్బా..? టీడీపీని ఇరకాటంలోకి పెట్టేంత ఫొటోలు ఏమున్నాయ్..? అని ఆశ్చర్యపోతున్నారా..? అవును పూర్తి వివరాలు తెలిస్తే మీకే తెలుస్తుంది అసలు సంగతేంటనేది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఎన్నికల పూర్తయిన నాటి నుంచి ప్రస్టేషన్ ఎక్కువవడంతో వైసీపీ, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న విషయం విదితమే. ఇటీవల ఆయన లండన్ పర్యటనకు వెళ్లాలని సిద్ధమవ్వడం, హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో ‘అవెంజర్స్’ సినిమా చూశారని ఫొటోలు నెట్టింట్లో హల్‌చల్ చేయడంతో ఇవి చూసిన చంద్రబాబు పెద్ద ఎత్తున హడావుడి చేశారు. అంతేకాదు ప్రెస్‌మీట్ పెట్టి మరీ నానా హంగామా చేశారు. రాష్ట్రంలో ఓ వైపు తుఫాన్, మరోవైపు ప్రజలు ఇబ్బందులు పడుతుంటే జగన్ మాత్రం హాయిగా సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారని బాబు విమర్శించారు. ఇంకా చాలానే అన్నారు.. అవన్నీ ఇక్కడ అప్రస్తుతం.
బాబోరు ఇప్పుడేమంటారో..!?
అయితే తాజాగా.. టీడీపీకి చెందిన కీలక నేత, తాజా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విదేశాలకు టూర్‌కు వెళ్లి హాయిగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నట్లు కొన్ని ఫొటోల తన ట్విట్టర్ ఖాతాలో పెట్టారు. అయితే తాను ఎక్కడున్నది..? ఏం చేస్తున్నాను..? అనే అప్డేట్ ఇవ్వడానికి గంటా ఫొటోలు పెట్టారు. అయితే ఆ సీన్ కాస్త రివర్స్ అయ్యింది. ఇటీవల విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాలపై ‘ఫొనీ’ తుఫాన్ ప్రభావంతో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. అయితే సొంత జిల్లాలో ఇంత జరుగుతున్నా అలనాటి మంత్రిగారు మాత్రం పట్టించుకోకుండా విహారయాత్రలకెళ్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు వైసీపీ నేతలు, కార్యకర్తలు అటు మీడియా వేదికగా.. ఇటు సోషల్ మీడియా వేదికగా జగన్ వెళితే మాత్రం అంత హంగామా చేసే బాబు.. ఇప్పుడు గంటా వెళితే నోరుమెదపకపోవడమేంటి..? అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వ్యవహారం టీడీపీ అధిపతి దాకా వెళ్లడంతో గంటా అనవసరంగా పార్టీని బుక్ చేశారని సన్నిహితులతో చెప్పి ఒకింత బాబు అసంతృప్తికి లోనయ్యారట. మనం నీతులు చెబుతున్నప్పుడు ఫస్ట్ సక్రమంగా లేకపోవడమేంటి..? అని ఆగ్రహించారట. అంతేకాదు గంటాకు కాల్ చేసి ఏంటిది..? ఇలానేనా చేసేది..? అంటూ చీవాట్లు పెట్టారట.
ఇదిలా ఉంటే.. ఈ ఎన్నికల్లో సొంత నియోజకవర్గం భీమిలీని వదిలిన గంటా విశాఖ నార్త్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. కాగా ఇక్కడ్నుంచి వైసీపీ తరఫున కమ్మిల కన్నపరాజు, జనసేన తరఫున పసుపులేటి ఉషా కిరణ్, కాంగ్రెస్ గంప గోవిందరాజు, బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు పోటీ చేస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో అదృష్టం ఎవర్ని వరించునో వేచి చూడాల్సిందే మరి.