వలస కూలీల దయనీయ పరిస్థితిపై హరీశ్ ఆవేదన!
- IndiaGlitz, [Friday,May 29 2020]
కరోనా మహమ్మారి కాటేస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్‌తో వలస కార్మికులు వేల కిలోమీటర్లు నడిచి వెళ్తున్నట్లు టీవీలు, పేపర్లు, సోషల్ మీడియాలో చూసి చలించిపోయే ఘటనలు మనమంతా చాలానే చూసుంటాం. అయితే వారికి నేనున్నా అంటూ అభయమిచ్చి బాలీవుడ్ ప్రముఖ నటుడు సోనూసూద్, టాలీవుడ్‌లో మంచు మనోజ్ లాంటి వారు చిరు ప్రయత్నం చేసి వారి స్వగ్రామాలకు తరలించే ప్రయత్నం చేశారు. ఇప్పటికీ దేశంలో జాతీయ రహదారులు వలస కూలీల రక్త పాదముద్రలతో తడుస్తున్నాయంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ పరిస్థితిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు తీసుకున్న చర్యలకు మించి తీసుకొని వారిని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఏ ఒక్క వలస కూలి రోడ్డెక్కకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.
మమ్మల్ని చూసే లోకులకు బాధేస్తోంది!
తాజా పరిస్థితులను చూసి చలించిపోయిన టాలీవుడ్ దర్శకుడు హరీశ్ శంకర్.. తీవ్ర ఆవేదనకు లోనయ్యి తన ఆర్ద్రతను అక్షరాల రూపంలో రాసుకొచ్చారు. ‘బండరాళ్లను పిండి చేసిన చేతులు డొక్క నొప్పికి లొంగిపోయాయి. పెద్ద పెద్ద ఇనుప చువ్వలను వంచిన వేళ్లు మెత్తని పేగుల ముందు ఓడిపోయాయి.. మమ్మల్ని చూసే లోకులకు బాధేస్తోంది, జాలేస్తోంది. కానీ మాకు మాత్రం ఆకలేస్తోంది’ అని వలస కూలీల బాధాతప్త అంతరంగాన్ని హరీశ్ తన ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. ఈ ట్వీట్‌లో రక్తం కారుతున్న పాదాల ముద్రలు కూడా ఉన్నాయి. కాగా ఈ ట్వీట్‌కు పలువురు నెటిజన్లు స్పందిస్తూ సార్.. మీ వంతుగా మీరు సాయం చేయండి సార్.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం మీరు నిజంగానే డైరెక్టర్ అనిపించుకున్నారు సార్ కామెంట్స్ చేస్తున్నారు.