‘వకీల్ సాబ్’ వేదికగా ఆసక్తికర విషయం వెల్లడించిన హరీష్ శంకర్
- IndiaGlitz, [Monday,April 05 2021]
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ హీరోగా నటించిన చిత్రం ‘వకీల్ సాబ్’.ఈ సినిమా ఈనెల 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం శిల్పకళా వేదికలో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు చిత్ర సీమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకకు హాజరైన ప్రముఖదర్శకుడు హరీష్ శంకర్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘తొలి ప్రేమ’ సినిమా 100 డేస్ ఫంక్షన్ తరువాత ఓ కాలేజీ కుర్రాడు ఆయనతో సినిమా తీయాలని అనుకుంటే.. మరో కుర్రాడు ఆయన ఎప్పటికైనా ప్రొడ్యూసర్ అయితే చూడాలని అనుకున్నాడని వెల్లడించారు.
ఈ సందర్భంగా హరీశ్ శంకర్ మాట్లాడుతూ.. ‘‘చాలా రోజుల తర్వాత వచ్చిన పండగ ఇది మనకి. పవన్‌కళ్యాణ్ మళ్లీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు స్టార్ చేసినందుకు నేను థ్యాంక్స్ చెబుతున్నాను. ఎందుకంటే.. లాక్‌డౌన్ తర్వాత ఆల్ మోస్ట్ కుదేలైన పరిశ్రమని మెరుగుపరిచేందుకు ఏ అధికారం లేకుండా.. ఏ పదవి లేకుండా.. వంద కోట్ల టర్నోవర్ చేస్తూ.. ఎంతో మంది ఉపాధి కల్పించే దిశగా ఆయన సినిమాను చేస్తున్నందుకు ఆయనకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. అయితే నేను కేవలం ఆయన్నిపొగడటం కాదు. లాక్‌డౌన్ తర్వాత సినిమా చేస్తున్న ప్రతీ హీరోకి, ప్రతీ ఆర్టిస్టుకి, ప్రతీ టెక్నీషిన్‌కి ‘వకీల్ సాబ్’ వేదికగా.. నేను ధన్యవాదాలు చెబుతున్నాను. ఏ సినిమా అయినా, ఎవరి సినిమా అయినా అది సక్సెస్ అయితే ముందుగా సంతోషించే వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆయన సినిమాల్ని వదిలేద్దామనుకున్నా.. సినిమా ఆయన్ని వదలదు.
ఈ సందర్భంగా ఓ విషయాన్ని షేర్ చేసుకోవాలి. తొలి ప్రేమ 100వ రోజు రిపీట్ ఆడియన్స్‌తో షోస్ పడుతున్నాయి. ఆ టైంలో ఓ కాలేజీ కుర్రాడు, ఓ డిస్ట్రిబ్యూటర్ పవన్ కటౌట్ చూస్తూ ఉన్నారు. కాలేజీ కుర్రాడు పవన్‌కళ్యాణ్‌తో సినిమా చేయలని అనుకున్నాడు. డిస్ట్రిబ్యూటర్.. ఎప్పటికైనా ప్రొడ్యూసర్ అయితే ఈ హీరోతో సినిమా చేయాలని అనుకున్నాడు. మొదటి కుర్రాడు కొన్ని సంవత్సరాల తర్వాత గబ్బర్‌సింగ్ తీశాడు. డిస్ట్రిబ్యూటర్.. ప్రొడ్యూసర్‌లా మారి ఇప్పుడు వకీల్‌సాబ్ తీశాడు. దిల్ ఈ సినిమాని ఓ పెద్ద ప్రొడ్యూసర్‌గా కాకుండా పవన్‌కళ్యాణ్ అభిమానిగా తెరకెక్కించాడు. వకీల్ సాబ్ డబ్బింగ్ పూర్తయ్యాక హీరోని కలిశాను. సినిమా మొత్తం అయిపోయాక.. ఆయన మొహంలో ఓ తృప్తి కనిపించింది. ఇక వేణు శ్రీరామ్.. ‘కూర్చో నందాగారూ కూర్చో’ ఈ ఒక్క డైలాగ్ చాలుగా సినిమా చూసేందుకు. సినిమా డబ్బింగ్ పూర్తయ్యాక వేణు శ్రీరామ్ మొహం చూశాను. ఆయన మొహంలో ఒక తృప్తి కనిపించింది. అదేంటో మీరు ఏప్రిల్ 9న థియేటర్లలో చూస్తారు. ఆ తర్వాత నాకు అర్థమైంది.. ఇది మాములు వకీల్ సాబ్ కాదు.. ఏ కీలుకాకీలు తీసే వకీలు అని. మీరు పవన్‌కళ్యాణ్ సినిమా కోసం ఎంత ఆకలిగా ఉన్నారో.. నేను ఓ ఫ్యాన్‌గా ఎదురుచూస్తున్నాను. మన ఆకలి తీరే రోజు దగర్లోనే ఉంది’’ అని అన్నారు.