కేసీఆర్ ముందే స్టేజ్‌పై హరీశ్ రావు కంటతడి!!
- IndiaGlitz, [Monday,July 22 2019]
అవును సీఎం కేసీఆర్ ముందే ట్రబుల్ షూటర్, కట్టప్పగా పేరుగాంచిన మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు కంటతడి పెట్టుకున్నారు. సోమవారం నాడు సీఎం కేసీఆర్ తన సొంత గ్రామమైన మెదక్ జిల్లా చింతమడకలో పర్యటించిన విషయం విదితమే. ఈ సందర్భంగా కేసీఆర్ గురించి, చింతమడక గ్రామం గురించి మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. అంతేకాదు.. ఈ క్రమంలో ఉద్యమం చేసిన రోజులు గుర్తొచ్చాయంటూ హరీశ్ స్టేజ్‌పైనే ఏడ్చేశారు. హరీశ్ కన్నీళ్లు పెట్టుకోవడంతో సభా ప్రాంగణంలో ఒక్కసారిగా ఉద్విగ్న పరిస్థితులు నెలకొన్నాయి.
కేసీఆర్‌కు వినతులు!!
సుమారు అరగంటకు పైగా కేసీఆర్ గురించి.. చింతమడక కావాల్సిన సదుపాయాల గురించి హరీశ్ నిశితంగా వివరించారు. చంద్రశేఖర్‌రావు రాకతో చింతలేని గ్రామంగా చింతమడక మారుతుందన్నారు. ఉద్యమ సమయంలో కేసీఆర్‌కు చింతమడక బాసటగా నిలిచిందని చెకప్పుకొచ్చారు. ‘కేసీఆర్ ఆమరణ దీక్ష సమయంలో చింతమడకలో ఒక్క ఇంట్లోనూ పొయ్యి వెలగలేదు. ఉద్యమంలో మీరంతా కేసీఆర్‌ను వెన్నంటి ఉన్నారు. చింతమడకవాసులతో ఆత్మీయానురాగాలు పంచుకునేందుకు కేసీఆర్ వచ్చారు. కేసీఆర్ రాకతో బతుకమ్మ, దసరా, దీపావళి పండుగలు ఒక్కసారి వచ్చినట్లుంది. గ్రామంలో ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పిస్తాం. ఇల్లు లేని వారికి ఇంటి నిర్మాణం చేయిస్తాం. చింతమడక పరిసర గ్రామాలకు రహదారులు కావాలని విజ్ఞప్తులు అందాయి. చింతమడకలో అభివృద్ధి పనుల కోసం రూ. 10 కోట్లు ఇవ్వాలని కోరుతున్నాం. సిద్దిపేట నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు నిధుల మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను’ అని కేసీఆర్‌కు హరీశ్ విజ్ఞప్తి చేశారు.
క్లారిటీ ఇచ్చేసిన కట్టప్ప!!
వాస్తవానికి హరీశ్ రావుకు కేసీఆర్ తన కేబినెట్లో చోటివ్వకపోవడంతో గత కొన్ని రోజులుగా మామా అల్లుళ్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందని వార్తలు గుప్పుమంటున్నాయి. అంతేకాదు కేసీఆర్ కారు నుంచి హరీశ్ దిగేసి సొంత కుంపటి పెట్టుకుంటారని కూడా అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే తాజా బహిరంగ సభలో అవన్నీ పటాపంచలయ్యాయని చెప్పుకోవచ్పు. తాను కేసీఆర్ అడుగు జాడల్లోనే నడుస్తాని.. టీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదంటూ హరీశ్ రావు తేల్చిచెప్పేశారు. అయితే ఇకనైనా హరీశ్‌పై అనవసర వార్తలు తగ్గుతాయో లేకుంటే యధావిధిగా కొనసాగుతాయో వేచి చూడాల్సిందే మరి.